కడుపులో కత్తెర వదిలేసిన వైద్యురాలు

Spread the love

అలవాటులో పొరపాటు కడుపులో కత్తెర వదిలేసిన వైద్యురాలు

ఎక్స్‌రేలో బయటపడిన భాగోతం

ఏలూరు: ఆగస్టు 16
కాన్పుకు వచ్చిన గర్భిణికి సిజేరియన్‌ చేశారు. కానీ, కడుపులో కత్తెర వదిలేసి కుట్లు వేశారు. బాధితురాలు కడుపు నొప్పితో బాధపడుతుండడంతో ఎక్సరే తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

అంతే క్షణాల వ్యవధిలోనే సర్జరీ, బాధితురాలి వివరాలు మాయం చేసేశారు. సర్జరీ చేసిన వైద్యురాలిని రక్షించేందుకు గతంలో అక్కడే పనిచేసిన ఓ వైద్య ఉన్నతాధికారి తీవ్రంగా కృషి చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే ఏలూరు ప్రభుత్వాస్పత్రికి వారం క్రితం కాన్పు నిమిత్తం ఓ మహిళ వచ్చింది. పరీక్షలు నిర్వహించిన ఓ సీనియర్‌ సివిల్‌ సర్జన్‌ ఆమెకు సిజేరియన్‌ చేసి, పండంటి బిడ్డను బయటకు తీశారు. అయితే కుట్లు వేసే క్రమంలో అలవాటులో పొరపాటుగా కడుపులో ఉన్న కత్తెరను తీయడం మరిచిపోయారు.

అప్పటి నుంచి ఆమె కడుపునొప్పితో బాధపడుతోంది. దీంతో వైద్యులు ఎక్స్‌రే తీయించడంతో కడుపులో కత్తెర ఉన్న విషయాన్ని గుర్తించారు. కానీ ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. అయితే ఈ ఎక్స్‌రే ఫొటోను సదరు ఉద్యోగి తన ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాల్లో పోస్టు చేయడంతో విషయం బయటపడింది.

వెంటనే సంబంధిత ఆస్పత్రి అధికారులు ఆ ఉద్యోగిని పిలిచి మందలించడంతో ఆయన ఆ పోస్టులను తొలగించాడు. అలాగే ఆస్పత్రి రికార్డుల్లో బాధితురాలి కేసు షీట్‌, చిరునామా, ఫోన్‌ నెంబర్‌ వంటి సమాచారాన్ని కూడా ధ్వంసం చేసినట్లు సమాచారం.

ఆస్పత్రి ఆవరణలోని ఎక్స్‌రే విభాగంలో తీసిన రికార్డులపై మాత్రం బాధితురాలి పేరు, తేదీతో సహా పలు వివరాలు ఉన్నాయి. ఎక్స్‌రేలో కత్తెర స్పష్టంగా కనిపిస్తుండటంతో వైద్యులు కంగారు పడుతున్నారు.

ఎక్స్‌రే రూపేణా వ్యవహారం బయటకు పొక్కడంతో సదరు వైద్యురాలు ఓ ఉన్నతాధికారిని సంప్రదించారు. ఈ సమస్య నుంచి బయటపడేయాలని ప్రాధేయపడ్డారు. చాలా కాలం కలిసి పనిచేసిన చొరవ కొద్దీ ఆయన ఈ వ్యవహారాన్ని బయటకు రాకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

విషయం తెలిసిన ప్రతీ ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడుతూ సమస్యను సద్దుమణిగేలా చేస్తున్నారు. ఘటన జరిగి పది రోజులు కావస్తున్నా అసలు అలాంటిదేమీ ఆస్పత్రిలో జరగలేదన్నట్టు పలువురు అధికారులు వ్యవహరిస్తుండటం ఇందుకు తార్కాణం.

దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శశిధర్‌ను వివరణ కోరగా తాను సెలవులో ఉన్నానని, కత్తెర మరిచిన ఘటన తన దృష్టికి రాలేదని చెప్పారు…

78 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?