
పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంటున్నది.
ఇటీవల డీఏలను విడుదల చేయగా ఇప్పుడు పంచాయతీ కార్యదర్శులపై ప్రేమ కురిపించింది. నాలుగేళ్ళ ప్రొబేషనరీ కాలాన్ని పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
ఇందుకోసం జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. కమిటీ పరిశీలనలో నిర్దేశించిన లక్ష్యాల్లో కనీసంగా మూడింట రెండొంతల మేర పూర్తిచేసినవారి సర్వీసును క్రమబద్ధీకరించాలని అధికారులు, మంత్రులతో సచివాలయంలో మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన చర్యలను ప్రారంభించాల్సిందిగా ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
రాష్ట్రంలోని గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో పంచాయతీ కార్యదర్శుల పాత్ర అభినందనీయమని ప్రశంసించిన కేసీఆర్.. దేశంలోని పలు రాష్ట్రాల్లోని గ్రామాలతో పోటీ పడి జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయని, ఇందుకు కృషిచేసింది వీరేనని వ్యాఖ్యానించారు.
ఇప్పటివరకు సాధించినదానితోనే సంతృప్తి చెంది అలసత్వం వహించరాదన్న ఉద్దేవంతో మరింత గుణాత్మకంగా గ్రామాలు మార్పు చెందేలా ప్రజల భాగస్వామ్యంతో పంచాయతీ కార్యదర్శుల నిరంతర కృషి కొనసాగాలన్నారు.
నాలుగేండ్ల శిక్షణాకాలాన్ని పూర్తిచేసుకున్న పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను నిర్దేశించిన నిబంధనల మేరకు వారి పనితీరును పరిశీలించి రెగ్యులరైజ్ చేయాలని సీఎం నిర్ణయించారు.
గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతను కాపాడేందుకు పంచాయితీ కార్యదర్శులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం. మొక్కలు నాటించడం, వాటిని కాపాడే దిశగా పర్యవేక్షించడంతో పాటు పలు రకాల బాధ్యతలను చేపట్టాలనే నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం వారికి విధిగా నిర్ణయించిందని గుర్తుచేశారు.
వారి సర్వీసును రెగ్యులరైజ్ చేయడానికి వారి పనితీరులో పై అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని, నిర్దేశించిన లక్ష్యంలో మూడింట రెండొంతులు బెంచ్ మార్కుగా ఫిక్స్ చేయాలని అధికారులకు సీఎం సూచించారు.
వీఆర్ఏలను ఎక్కడ పోస్ట్ చేద్దాం.. ?
రాష్ట్రంలో పనిచేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లను ఏయే డిపార్టుమెంట్లలో డిప్యూట్ చేయాలనే అంశంపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు.
వీఆర్ఏల విద్యార్హతలను, సామర్ధ్యాన్ని పరిగణనలోకి తీసుకుని సాగునీటిపారుదల శాఖతో పాటు పలు డిపార్టుమెంట్లలోకి పంపాలని, వారి సేవలను సమర్ధవంతంగా, విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు.
ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి కేటీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. వారం రోజుల వ్యవధిలో మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులు ఈ కసరత్తు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. తక్షణమే (బుధవారం నుంచి) వీఆర్ఏ సంఘం ప్రతినిధులతో చర్చలు మొదలుపెట్టాలన్నారు.
ఈ చర్చల తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ తగిన నిర్ణయాలు తీసుకుని వీఆర్ఏల సేవలను వాడుకునే దిశగా చర్యలు చేపట్టాల్సిందిగా ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
ఉప సంఘం నుంచి నివేదిక వచ్చిన తర్వాత మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని తాజా సమావేశంలో సీఎం స్పష్టత ఇచ్చారు. మొత్తం ప్రక్రియ వారం రోజుల్లోపూర్తికావాలని డెడ్‌లైన్ విధించారు.