వ్యక్తి ప్రాణాలు బలి తీసుకున్న రైల్వేగేటు..

Spread the love

గుండెపోటు.. వ్యక్తి ప్రాణాలు బలి తీసుకున్న రైల్వేగేటు..

కరీంనగర్‌: కూతురు గురుకులం విద్యాలయంలో పదోతరగతి చదువుతోంది. రెండో శనివారం కావడంతో విద్యాలయంలో పేరెంట్స్‌డే నిర్వహించారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురును చూసేందుకు ఆ తండ్రి విద్యాలయానికి వచ్చాడు.

ఇంటినుంచి తీసుకెళ్లిన ప్రత్యేకమైన వంటకాలు కూతురుకు తినిపించాడు. అంతలోనే విధి వక్రీకరించిందేమో.. ఆ తండ్రి గుండెపోటుతో అల్లాడిపోయాడు. వెంటనే పాఠశాల సిబ్బంది అతడిని కరీంనగర్‌ తరలించారు. అక్కడ మరోసారి విధి అతడిని చిన్నచూపు చూసింది.

అప్పుడే కరీంనగర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని తీగలగుట్టపల్లి రైల్వే గేటు పడింది. సుమారు 15 నిమిషాలు ఆలస్యమైంది. ఆసుపత్రిలో చేర్చగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

సంఘటనకు సంబంధించిన వివరాలు.. మండలంలోని మల్లాపూర్‌ సాంఘిక సంక్షేమ బాలికల గురుకులం విద్యాలయంలో జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన భూపెల్లి విజయ్‌, సుధీవన కూతురు స్పందన పదో తరగతి చదువుతోంది. రెండో శనివారం కావడంతో విద్యాలయంలో పేరెంట్స్‌ డే నిర్వహించారు.

దీంతో విజయ్‌, సుధీవన దంపతులు ఉదయమే కూతురు కోసం ప్రత్యేకమైన వంటకాలు తయారు చేసుకుని విద్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం కూతురుతో కలిసి భోజనం చేశారు.

అదే సమయంలో వర్షం రావడంతో ప్రిన్సిపాల్‌ గిరిజ తల్లిదండ్రులందరరినీ హాల్‌లోకి రావాలని సూచించారు. హాల్‌లోకి వచ్చి విజయ్‌ కూర్చుంటున్న క్రమంలోనే కుప్పకూలిపోయాడు. గమనించిన ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్‌ సుంచు మల్లేశం, విజయ్‌ భార్య సుధీవన చికిత్స కోసం అంబులెన్స్‌లో కరీంనగర్‌కు తరలించారు.

కరీంనగర్‌ వద్ద ఉన్న రైల్వేగేట్‌ అప్పుడే పడటంతో సుమారు 15 నిమిషాలపాటు విజయ్‌ అంబులెన్స్‌లోనే కొట్టుమిట్టాడాడు. తీరా ఆసుపత్రిలో చేర్చాక.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

కరీంనగర్‌లో గేట్‌ పడకుంటే విజయ్‌ బతికేవాడని మల్లేశం తెలిపారు. మృతదేహం వద్ద కూతురు స్పందన రోదించిన తీరు కలచివేసింది. కుటుంబసభ్యులు, రోదనలతో స్తంభంపల్లిలో విషాదం నెలకొంది.

కాగా కరీంనగర్‌ వద్ద రైల్వే గేటుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై బ్రిడ్జ్ నిర్మించాలని గత తొమ్మిదేళ్లుగా స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

నగరంలోని ఆసుపత్రులకు ఉమ్మడి జిల్లాతోపాటు, ఆదిలాబాద్‌ జిల్లా నుంచి రోగులను అంబులెన్స్‌ల్లో కరీంనగర్‌ తీసుకు వచ్చినా గేటుతో ఇబ్బందులు పడ్డ సందర్భారాలున్నాయి.

అంబులెన్స్‌లో తీసుకు వచ్చిన రోగులు గంటల కొద్ది గేటు పడడంతో గతంలో పలువురు రోగులు మరణించిన సందర్భాలు ఉన్నాయి,

తాజాగా ఆర్వోబీ నిర్మాణం చేపట్టకపోవడంతో పరిస్థితి ఎలా ఉందో చెబుతూ ఆంబులెన్స్ దృశ్యాల్ని మొబైల్ కొంతమంది చిత్రీకరించారు. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

396 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?