
నోట్ల మార్పిడి కేసు.. ఆర్‌ఐ స్వర్ణలతపై సస్పెన్షన్ వేటు
విశాఖపట్నం: నోట్ల మార్పిడి దందా వ్యవహారంలో అరెస్ట్ అయిన ఏఆర్ ఆర్‌ఐ(హోంగార్డ్స్) స్వర్ణలతపై సస్పెన్షన్ వేటు పడింది. ఆమెతో పాటు కేసులో ఏ2గా ఉన్న ఎం.హేమ సుందర్‌ను కూడా సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ సి.ఎం.త్రివిక్రమ్ వర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా రూ.90 లక్షల విలువ గల రూ.500 నోట్లు ఇస్తే.. రూ.కోటి విలువ గల రూ.2 వేల నోట్లు ఇస్తామని ఇద్దరు రిటైర్డ్ నేవల్ ఆఫీసర్లను మోసం చేసిన విషయం తెలిసిందే.
బాధితులను బెదిరించి వారి నుంచి రూ.15 లక్షలు బలవంతంగా వసూలు చేసిన వ్యవహారంలో పోలీసులు ఆర్‌ఐ స్వర్ణలతతో పాటు మధ్యవర్తి సూరిబాబు, ఏఆర్ కానిస్టేబుల్ హేమసుందర్, హోంగార్డ్ శ్రీనివాసులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ ముగ్గురికి కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. వీరిని శనివారం విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు. సాధారణ మహిళా ఖైదీలతోపాటు స్వర్ణలతను బ్యారెక్‌లో ఉంచారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఐతో పాటు కానిస్టేబుల్‌పై సీపీ చర్యలకు ఉపక్రమించారు.
హోం గార్డు శ్రీనుదే కీలకపాత్ర
ఎబ్‌బీ-2లో పనిచేస్తున్న హోంగార్డు శ్రీను.. సూరిబాబుతో తనకున్న పరిచయంతోనే ఈ నోట్ల మార్పిడి వ్యవహారంలో ప్రధానంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
గతంలో గాజువాక, 2వ పట్టణ పోలీసు స్టేషన్లలో పనిచేసిన సమయంలో శ్రీనుపై పలు ఆరోపణలు వచ్చిన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హోంగార్డుల ఆర్‌ఐగా ఉన్న స్వర్ణలతను మంచి చేసుకొని విధులకు కూడా సరిగా హాజరుకాపోవడాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు.
ఆరిలోవకు చెందిన సూరిబాబు జనసేనకు చెందిన ఓ నేతలకు అనుచరుడిగా వ్యవహరిస్తున్నట్లు.. ఆ నాయకుడు తీస్తున్న సినిమాలో స్వర్ణలత నటించేలా చూస్తన్నట్లు తెలుస్తోంది.