
భార్యపై అనుమానంతో హత్య చేసిన భర్త
హైదరాబాద్:జూన్ 27
అనుమానం పెనుభూతం అని పెద్దలు ఊరికే అనలేదు. భార్యా లేదా భర్తలో అనుమానం మొదలైతే వారి కాపురం కలహాల కాపురంగానే మారిపోతుంది.
గొడవలు జరిగితే మామూలే గానీ ఆ అనుమానం ప్రాణాలు తీసేవరకు వెళ్లే పరిస్థితులు వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే నగరంలో ఈరోజు తెల్లవారుజామున బోరబండలో చోటు చేసుకుంది.
కడదాకా తోడుండాల్సిన భర్తే ఆమె పాలిట యమపాశంగా మారాడు. అనుమానం అనే రోగంతో రగిలిపోయిన ఆ భర్త.. కట్టుకున్న భార్య ప్రాణాలను తీసేదాగా విడిచిపెట్టలేదు.
బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. భార్య ఫాతిమా(35)ను భర్తని మిరాజ్ అలీ అతి దారుణంగా చంపేశాడు. దంపతులు మీరాజాలి, ఫాతిమా స్థానికంగా నివాసముంటున్నారు.
వీరికి ముగ్గురు పిల్లలు. గత కొంతకాలంగా ఇరువురి మధ్య కలహాలు వస్తూ ఉన్నాయి. భార్యను అనుమానిస్తున్న మిరాజ్ అలీ ఆమెతో ప్రతీరోజు గొడవలు పెట్టుకునేవాడు.
ఈ విషయంపై గత రాత్రి కూడా ఇరువురి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ క్రమంలో మిరాజ్ అలీ… భార్య ఫాతిమా తలపై రాడ్‌తో బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఫాతిమా సంఘటనా స్థలంలోనే మృతిచెంది.
ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు చికెన్ షాపులో పనిచేస్తున్నాడు. స్థానికుల ద్వారా విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
నిందితుడు మిరాజ్ అలీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తల్లి మరణించడం… తండ్రి జైలుకు వెళ్లడంతో వారి ముగ్గురు చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు…..