
ఎవరీ పెద్దమనిషి?. నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి
కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, చిన్నారెడ్డి,బలరాం నాయక్, మల్లు రవి తదితరులు వెళ్లారు. ఆ ఫోటోల్లో ఒక పెద్దమనిషి నన్ను ఆశ్చర్యపరిచారు.
అర్రే ఈయన ఇక్కడ ఎలా?, ఎందుకు అని అనిపించింది. మొదటి ఫొటోలో నుదురు మీద చిన్న కణితి ఉన్న పెద్ద మనిషిని చూడండి. చాలా తక్కువ మందే గుర్తు పడతారు.
ఆయన ఎవరో తెలుసుకునే ముందు ఆయన వయస్సు ఎంత ఉంటుందో అంచనా వేయండి?. ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, వేల ఎకరాల భూస్వామి, రేస్ క్లబ్ చైర్మన్.
ఈయన మనవడు హీరో వెంకటేష్ కూతురిని పెళ్లి చేసుకున్నాడు. సినిమా మనిషి కాదు , వ్యాపారవేత్త కాదు, ఫక్తు రాజకీయ నాయకుడు, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా , నాలుగు సార్లు ఎంపీగా గెలిచాడు.
ఆయన చివరిసారి పోటీ చేసింది 1996లో ,మరి ఇంకా లైమ్ లైట్ లో ఉన్నారా? రామసహాయం సురేందర్ రెడ్డి రామసహాయం కుటుంబం అంటే పూర్వ వరంగల్ జిల్లా డోర్నకల్, మహబూబా బాద్ ప్రాంతంలో పెద్ద పేరు.
సురేంద్ర రెడ్డి ముప్పై సంవత్సరాల వయస్సులో “మర్రిపెడ” సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మహబూబ్ బాద్ సిట్టింగ్ ఎంపీ మధుసూదనరావుగారి మరణం వలన 1965లో జరిగిన ఉప ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున గెలిచారు.
తరువాతి ఎన్నికల్లో అంటే 1967లో కూడా ఎంపీగా గెలిచారు. రామసహాయం కుటుంబం డోర్నకల్ కు చెందిన రామసహాయం రాఘవరెడ్డి మరియు దామోదర్ రెడ్డి అన్నదమ్ములు. దామోదర రెడ్డికి పిల్లలు లేరు.
రాఘవరెడ్డికి కొడుకు సురేంద్ర రెడ్డి కూతురు భారతి దేవి , మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సురేంద్ర రెడ్డి సోదరి భారతి దేవి డోర్నకల్ కే చెందిన నూకల రాంచంద్రారెడ్డిని వివాహం చేసుకున్నారు. నూకల రామచంద్రా రెడ్డి డోర్నకల్ నుంచి 1957-1972 వరుసగా నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు.
1972లో వెంగళరావు మంత్రి వర్గంలో ఆర్ధిక మంత్రిగా పనిచేస్తూ 1974 జూలైలో గుండెపోటుతో మరణించారు. నూకల రామచంద్రారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మాజీ ప్రధాని పీవీ గారికి సన్నిహిత మిత్రుడు.