
మద్యం మత్తులో కత్తితో దాడి.. ఒకరు మృతి
మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన వివాదం ఒకరి హత్యకు కారణమైంది.
ఈ ఘటనలో గూడెంకొత్తవీధి మండలం జర్రెల పంచాయతీ కొండకించంగి గ్రామానికి చెందిన గెమ్మెలి చిన్నారావు మృతి చెందాడు.
పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పూజారి మల్లన్న అదే గ్రామానికి చెందిన చిన్నారావు స్నేహితులు.
వీరిద్దరూ బుధవారం రాత్రి మద్యం సేవించారు. అంతకు ముందు మల్లన్న భార్యతో చిన్నారావు ఘర్షణ పడినట్టు చెబుతున్నారు.
తన భార్యపై చేయి చేసుకుంటావా.. అంటూ మల్లన్న చిన్నారావుతో గొడవ పడ్డాడు.
ఈ క్రమంలో అతని వద్ద ఉన్న కత్తితో చిన్నారావు మెడపై దాడిచేశాడు. దీంతో చిన్నారావు తీవ్రంగా గాయపడ్డాడు.
ఇతన్ని కుటుంబ సభ్యులు చింతపల్లి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలిస్తుండగా చిన్నారావు మరణించాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు జీకే వీధి పోలీసులు తెలిపారు.