
వారికి ప్రగతి భవన్ కు నో ఎంట్రీ .. టెన్షన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!!
తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల వ్యూహాల్లో ఉన్నారు.
టికెట్ల కోసం ఆశావాహులు పడరాని పాట్లు పడుతున్నారు.కాంగ్రెస్, బిజెపిల లో పరిస్థితి అటుంచి, అధికార బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల విషయంలో విచిత్రమైన వాతావరణం చోటు చేసుకుంటుంది.
సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొందరు టికెట్ దొరుకుతుందా లేదా అన్న ఆందోళనలో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
సీఎం కేసీఆర్ ని కలిసి ఎలాగైనా సరే టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాలని భావించిన ఎమ్మెల్యేలకు ప్రగతిభవన్లోకి నో ఎంట్రీ బోర్డు దర్శనం ఇస్తుందని సమాచారం.
ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ని కలిసి నియోజకవర్గాల సమస్యలపై మాట్లాడి, పరిష్కారాలను తెలుసుకొని, ఎలాగైనా కేసీఆర్ ను మాట్లాడి ప్రసన్నం చేసుకోవాలని భావించిన ఎమ్మెల్యేలకు ప్రగతిభవన్లో కి ఎంటర్ కావడానికి అవకాశం దొరకడం లేదు.
అపాయింట్మెంట్ ఉన్న ఎమ్మెల్యేలను తప్ప, అపాయింట్మెంట్ లేకుండా వచ్చే ఎమ్మెల్యేలను ప్రగతి భవన్ గేటు నుండే బయటకు పంపిస్తున్నారని సమాచారం.
అపాయింట్మెంట్ వుంటేనే సీఎం కేసీఆర్ ను కలవడానికి అవకాశం ఇస్తున్నారని తెలుస్తుంది. కొంత మంది ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ను కలవడానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని సమాచారం.
కొత్త సెక్రటేరియట్ లో కెసిఆర్ ను కలవాలని వెళ్ళినా అక్కడ ప్రైవేటుగా మాట్లాడలేక ప్రగతి భవన్ బాటపడుతున్నారు ఎమ్మెల్యేలు.
అయితే ఈ సమయంలో ఎమ్మెల్యేలు ఎందుకు వస్తారు? ఎందుకు మాట్లాడాలని చూస్తారు? అనే విషయాలను ముందుగా గమనించిన కెసిఆర్ ఎమ్మెల్యేలతో మాట్లాడడానికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని తెలుస్తుంది.
సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ మొదట్లో టికెట్లు ఇస్తామని చెప్పినప్పటికీ నియోజకవర్గంలో ప్రజల మద్దతు లేని ఎమ్మెల్యేలను గుర్తించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
ఈ సమయంలో టెన్షన్ లో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ ను కలవాలని ప్రయత్నం చేసినా, టికెట్ విషయంలో ఆయన దగ్గర హామీ తీసుకోవాలని భావిస్తున్నా ఆ ప్రయత్నాలేవీ సఫలం కావడం లేదు.
అసలు టికెట్ ఇస్తారా లేదా? తమపైన సీఎం కెసిఆర్ అభిప్రాయం ఏమిటి? ఒకవేళ టికెట్ ఇచ్చే ఆలోచన లేకపోతే ఏం చేయాలి?
వంటి ఆలోచనలతో సతమతమవుతున్న వారు కెసిఆర్ మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రగతి భవన్ బాట పట్టినా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు నో ఎంట్రీ అనడంతో దిక్కుతోచని స్థితిలో పడుతున్నారని సమాచారం.