
ఆర్టీసీ బస్సులో మందుబాబు వీరంగం
మద్యం సేవించి బస్సులో వీరంగం సృష్టించడం ఓ మందుబాబు.
గురువారం తిరుపతి రూరల్ మండలం కాలూరు వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించి బస్సు కండక్టర్, డ్రైవర్, ప్రయాణికుల వివరాల మేరకు..
తిరుమల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 30 మంది ప్రయాణికులతో తిరుమల నుంచి వేలూరుకు వెళ్తోంది.
అయితే తిరుపతి సమీపంలో చైన్నెకి చెందిన మణి అనే వ్యక్తి బస్సు ఎక్కాడు. బస్సు రన్నింగ్‌లో ఉండగా చివరి సీట్లో కూర్చుని తిరుపతి రూరల్ మండలం కాలూరు సమీపంలోకి వచ్చేసరికి అతను మద్యం సేవిస్తున్నాడు.
దీన్ని చూసిన తోటి ప్రయాణికులు బస్సు కండక్టర్ శ్రీనివాస శెట్టి, డ్రైవర్ ఎస్‌ఆర్ వేలుకు విషయాన్ని తెలిపారు. దీంతో కాలూరు సమీపంలో అతన్ని బస్సు దిగాలని కండక్టర్ సూచించగా, నన్నే బస్సులో నుంచి దింపేస్తారా అంటూ మణి మద్యంమత్తులో రెచ్చిపోయాడు.
దీంతో అందరూ బలవంతంగా అతన్ని బస్సులో నుంచి దింపేశారు. అయితే నన్ను బస్సులో నుంచి దింపేస్తే ఊరుకుంటానా అంటూ రాయి తీసుకుని బస్సు వెనుక అద్దాలను పగలగొట్టాడు.
దీంతో బస్ కండక్టర్, డ్రైవర్ సదరు మందుబాబును చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లగా, అక్కడి సిబ్బంది సూచనల మేరకు ఎంఆర్ పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.