
లిప్ట్ లో ఇరుక్కుపోయిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓ రెస్టారెంట్ లిప్ట్ లో ఇరుక్కుపోయారు. దీంతో ఆయన అనుచరులు, బిఆర్ఎస్ శ్రేణులు, సెక్యూరిటీ సిబ్బంది కంగారుపడ్డారు.
అయితే కొద్దిసేపటి తర్వాత మంత్రి సురక్షితంగా లిప్ట్ లోంచి బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళితే… ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా నిన్న(బుధవారం) మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ నుండి మంచిర్యాల జిల్లాకు బయలుదేరారు.
మార్గమధ్యలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి పెద్దపల్లి పట్టణంలో పర్యటించారు. ఈ క్రమంలోనే కూనారం చౌరస్తాలో ఓ బిఆర్ఎస్ నాయకుడు నిర్వహిస్తున్న రెస్టారెంట్ కు మంత్రి వెళ్ళారు.
కొద్దిసేపు రెస్టారెంట్ లో వున్న శ్రీనివాస్ గౌడ్ భవనం పైనుండి కిందకు వచ్చేటపుడు లిప్ట్ ఎక్కారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ లిప్ట్ లో వుండగా సాంకేతిక సమస్య తలెత్తి మధ్యలోనే ఆగిపోయింది.
దీంతో మంత్రి లిప్ట్ లో ఇరుక్కుపోవడంతో అక్కడున్నవారంతా ఆందోళనకు గురయ్యారు. చివరకు పోలీసులు కాస్సేపు శ్రమించి లిప్ట్ తలుపులు తీసారు.
దీంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు లిప్ట్ లోని వారంతా బయటకు వచ్చారు. అనంతరం మంత్రి తన కారెక్కి చెన్నూరుకు బయలుదేరారు.