
నడిరోడ్డుపై పార్టీ కార్యకర్త దారుణ హత్య
అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. బెంగళూరులోని చౌడేశ్వరి నగరలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టమ్ కోసం విక్టోరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
హతుడి పేరు రవి అలియాస్ మత్తి రవి. వయస్సు 42 సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్త. గతంలో ఎన్‌ఎస్‌యూఐలో పని చేశారు.
ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజరాజేశ్వరి నగర నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి హెచ్ కుసుమ తరఫున విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. స్థానికంగా టెంపో డ్రైవర్‌గా పని చేస్తోన్నాడు.
బుధవారం రాత్రి కృష్ణమూర్తి అనే స్థానిక కాంగ్రెస్ నాయకుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు. అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిన అతణ్ని గుర్తు తెలియని వ్యక్తులు వెంటాడి హత్య చేసినట్లు చెబుతున్నారు.
చౌడేశ్వరి నగర్‌లోని హళ్లిరుచి హోటల్ ఎదురుగా రక్తపుమడుగులో పడి ఉన్న రవి మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు. నందిని లేఅవుట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు అతని తలపై రాళ్లతో మోదడం వల్ల మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
చౌడేశ్వరినగర సమీపంలోని హెగ్గనహళ్లిలో గల సీఎంహెచ్ బార్ అండ్ రెస్టారెంట్‌లో చోటు చేసుకున్న ఘర్షణ నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండొచ్చని కూడా చెబుతున్నారు.
సీఎంహెచ్ బార్ అండ్ రెస్టారెంట్ వైపు నుంచి అతణ్ని అయిదుమంది వ్యక్తులు బైక్‌పై రవిని తరుముకుంటూ రావడం చూసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
అయిదుమంది గుర్తు తెలియని వ్యక్తులపై నందినీ లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
నిందితుల కోసం గాలిస్తోన్నామని, దీనికోసం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తోన్నామని పోలీసులు వెల్లడించారు.