
కారు పార్టీ లో కంగారు ?
వరుస సమీక్షలతో గులాబీ బాస్
హైదరాబాద్ :మే 25
తెలంగాణలో రెండు పర్యాయాలు అధికారాన్ని చేజిక్కించుకున్న బీఆర్‌ఎస్.. ఎట్టిపరిస్థితుల్లోనూ హ్యాట్రిక్ సాధించాలన్న సంకల్పంతో వ్యూహాలకు పదునుపెడుతోంది.
ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మూడోసారి గెలుపు తమదేనని గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న బీఆర్‌ఎస్ పార్టీని లోలోపల భయాలు వెన్నాడుతూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటకలో అధికార బీజేపీని ప్రజలు సాగనంపడంతో.. తెలంగాణలో ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారోనని కారు పార్టీలో కలవరం మొదలైంది.
తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని గుర్తించిన అధినాయకత్వం.. అదేమీ లేదన్న సంకేతాలివ్వడానికి రూటు మార్చింది.
చాలా ఏళ్లుగా తమ సమస్యలను పరిష్కరించాలని పలు రంగాలకు చెందినవారు ఆందోళనలకు దిగినా, ఆత్మహత్యలు చేసుకున్నా ఏమాత్రం స్పందించని సర్కారు..
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. ఆయా సమస్యలకు పరిష్కారాలు చూపుతూ తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది.
గతంలో ఎమ్మెల్యేలకు తరచూ కలిసే అవకాశం కూడా కల్పించని అధినేత కేసీఆర్.. ఇప్పుడు పిలిచి సమావేశాలు నిర్వహిస్తుండటంతో కర్ణాటక ఫలితం ద్వారా ఆయనకు తత్వం బోధపడినట్లుందని పార్టీకి చెందిన పలువురునేతలు అభిప్రాయపడుతున్నారు.
బీఆర్‌ఎస్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు పలు సర్వేల ద్వారా తెలుసుకున్న గులాబీ బాస్.. అన్ని విషయాల్లోనూ ఆచితూచి అడుగులు వేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఈ మేరకు కర్ణాటకలో అధికార బీజేపీ ఓటమి కారణాలను తెలుసుకొని.. ఇక్కడ ఎలా వ్యవహరించాలన్న దానిపై అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రజల్లో నెలకొన్న అసంతృప్తికి చెక్‌పెట్టేలా, సమస్యలను సత్వరం పరిష్కరించేలా వరుస సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ రాజకీయ కోణంలో జనాన్ని ఆకర్షించే నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఎన్నికల్లో గెలుపు కోసం కసరత్తు మొదలైందని, కొత్త పథకాలు ఎలా ఉండాలి? వాటికి ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ ఉంటుంది? అనే చర్చలు కొనసాగుతున్నాయని, సరైన సమయంలో ఆ పథకాలను ప్రకటించి విపక్షాలకు షాక్ ఇవ్వడం ఖాయమని బీఆర్‌ఎస్ శ్రేణులు చెబుతున్నాయి.
మరోవైపు.. నిధుల కొరత వల్ల పాత పథకాలనే పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయామని, ఇప్పుడు కొత్త పథకాలకు నిధులు ఎక్కడి నుంచి సమకూరుతాయన్న ప్రశ్న కూడా అధికార పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది…