
ఏసీబీ వలలో ఎస్‌ఐ, కానిస్టేబుల్
ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు ఎస్‌ఐ కందుల దుర్గాప్రసాద్, కానిస్టేబుల్ పరిమి సునీల్‌కుమార్ సోమవారం రాత్రి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ శరత్‌బాబు తెలిపిన కథనం ప్రకారం.. చిల్లకల్లు పోలీస్‌స్టేషన్‌లో కారు సీజ్ అయిన కేసులో గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన గరికపాటి నాగమల్లేశ్వరరావు, వేముల శంకర్ ఏ-4, ఏ-5 నిందితులుగా ఉన్నారు.
15 రోజుల క్రితం ఎస్‌ఐ కందుల దుర్గాప్రసాద్ కారు సీజ్ కేసును మాఫీ చేస్తానని, నిందితుల పేర్లు కూడా మారుస్తానని చెప్పి రూ.20 లక్షలు డిమాండ్ చేశారు.
దీంతో ఏ-4గా ఉన్న నిందితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రూ.1.80 లక్షలను కానిస్టేబుల్ సునీల్ ద్వారా ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌కు ఇస్తుండగా.. అతడి ఇంట్లోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
నగదు స్వాధీనం చేసుకుని ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టు తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సీఐ శ్రీనివాస్‌బాబు పాల్గొన్నారు.
బొగ్గు లారీ కేసులోనేనా?
ఈ ఏడాది జనవరిలో గతంలో పనిచేసిన ఎస్‌ఐ చిన్నబాబు మండలంలోని ఓ సిమెంట్ కర్మాగారానికి కొత్తగూడెం నుంచి వచ్చే బొగ్గు నాసిరకంగా వస్తోందని ఫిర్యాదు రావటంతో కేసు నమోదు చేశారు.
అనంతరం ఎస్‌ఐ బదిలీ అయ్యారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఏసీబీ ట్రాప్‌లో పడ్డ ఎస్‌ఐ కందుల దుర్గాప్రసాద్ దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులోనే బొగ్గులో సగం బూడిద కలిపి రవాణా చేస్తున్నట్టు గుర్తించారు.
దీనిలో గుంటూరు జిల్లాకు సత్తెనపల్లికి చెందిన గరికపాటి నాగమల్లేశ్వరరావు, వేముల శంకర్ ఉన్నారు. దీంతో ఎస్‌ఐ వారితో రూ.20 లక్షలు డిమాండ్ చేయగా.. నిందితులు రూ.5 లక్షలు ఇస్తామన్నారు.
మొదట కొంత ఇచ్చి సోమవారం రూ.1.80 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
బొగ్గు లారీ కేసులో రూ.20 లక్షల డిమాండ్ కానిస్టేబుల్ ద్వారా రూ.1.80 లక్షలు ఇస్తుండగా పట్టివేత