
నాడు లైన్‌మెన్.. నేడు రూ.కోట్లలో ఆస్తులు
★ డీఈఈ కార్యాలయంలో అనిశా సిబ్బంది సోదాలు
★ ఆదివారం మధ్యాహ్నం వరకు లెక్కలు
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)
అవినీతి నిరోధక శాఖ అధికారులు విద్యుత్తు శాఖ డీఈఈ సన్ని రాంబాబు నివాసంతో పాటు పలు చోట్ల శనివారం సోదాలు నిర్వహించి భారీగా ఆస్తులను గుర్తించారు.
పరవాడ ఫార్మాసిటీలో ఉన్న ఏపీఈపీడీసీఎల్ అనకాపల్లి సబ్ డివిజన్ ఎంఆర్‌టీ-సిటీ మీటర్స్ కార్యాలయం డీఈఈగా ఉన్న రాంబాబు పాతగాజువాక మెహర్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు.
అదనపు ఎస్పీ శ్రావణి నేతృత్వంలో సిబ్బంది ఇక్కడ తనిఖీ చేపట్టారు. అలాగే అనిశా సీఐ కిషోర్‌కుమార్ తన సిబ్బందితో శనివారం ఉదయం 10 గంటలకు ఎంఆర్‌టీ-సిటీ మీటర్స్ కార్యాలయానికి చేరుకుని…
ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల వరకు సోదాలు చేశారు. బీరువాల్లో సన్ని రాంబాబుకు చెందిన ఆస్తులకు సంబంధించిన దస్త్రాలు, బీమాబాండ్లు, నగదు లావాదేవీలకు చెందిన పత్రాలను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు.
అక్రమ ఆస్తుల చిట్టా..
గాజువాక అపార్ట్‌మెంట్ విలువ బహిరంగ సుమారు రూ.10కోట్ల పైమాటే. రాంబాబు నివాసం ఉంటున్న మూడంతస్తుల భవనం విలువ రూ.2-3 కోట్లుపైగానే ఉంటుందని అంచనా.
మల్కాపురంలోని రెండు భవనాల విలువ రూ.3కోట్లు. శివాజీపాలెంలో ఫ్లాట్ రూ.70లక్షలు పలుకుతుంది. ఇక భోగాపురంలో స్థలం విలువ కూడా భారీగానే ఉంటుంది.
కేవలం ఇళ్ల అద్దెల ద్వారా ప్రతినెలా రూ.4లక్షలు ఆర్జిస్తున్నట్లు సమాచారం. ఏసీబీ దాడుల్లో దొరికిన బంగారం, వెండి ఆభరణాల విలువ రూ.60 లక్షల వరకు ఉంటుందని అంచనా.
అలా మొదలెట్టి:
సన్ని రాంబాబు తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో మొదట లైన్‌మెన్‌గా ఉద్యోగంలో చేరారు.
ఆ తర్వాత పదోన్నతిపై పెదగంట్యాడలో ఏఈగా 2016 అక్టోబర్‌లో బాధ్యతలు చేపట్టి మూడేళ్లపాటు పనిచేశారు.
ఆ తర్వాత మల్కాపురం డివిజన్ ఏడీఈగా 2019 నవంబరులో బాధ్యతలు చేపట్టి 2022 జులై వరకు పని చేశారు.
ప్రస్తుతం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా అనకాపల్లి కార్యాలయంలో కొనసాగుతున్నారు. రాంబాబు భార్య పెదగంట్యాడలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.