
వీధికుక్కల దాడిలో బాలుడి మృతి
కన్నీరుమున్నీరుగా రోదిస్తున్న సంచారజాతి కుటుంబం
ఎంజీఎం దవాఖానలో చీఫ్ విప్, మేయర్ తదితరుల పరామర్శ
ప్రభుత్వం తరఫున రూ.లక్ష ఆర్థిక సాయం అందజేత
హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని చిల్డ్రన్ పార్కు సమీపంలో శుక్రవారం వీధి కుక్కలు దాడిచేయడంతో ఓ బాలుడు మృతి చెందాడు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి(బెనారస్) సమీపంలోని జైపూరియా గ్రామానికి చెందిన మలహర్ సింగ్-సునీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.
సంచార జాతికి చెందిన వీరు రోడ్లపై చేతి వేళ్ల రింగులు, చిన్న చిన్న వస్తువులు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు.
మూడు కుటుంబాలు అజ్మీర్ వెళ్లేందుకు రైలు లేకపోవడంతో గురువారం రాత్రి కాజీపేట రైల్వే చిల్డ్రన్స్ పార్కు ప్రహరీ పక్కన చెట్ల కింద బస చేశాయి.
మలహర్ సింగ్ కుమారుడు చోటు(7) శుక్రవారం ఉదయం పార్కు సమీపంలో బహిర్భూమికి వెళ్లడంతో వీధి కుక్కలు ఒక్కసారిగా మీదపడి దాడి చేశాయి.
తీవ్రంగా గాయపరిచి గొంతును పట్టేసి చంపేశాయి. స్థానికులు వెళ్లి పరిశీలించగా అప్పటికే చోటు మరణించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతుడు చోటును, కుటుంబ సభ్యులను పోలీస్ వాహనంలోనే ఎంజీఎం దవాఖానకు తరలించారు.
బాలుడు మృతి చెందడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. బాలుడి చెల్లెలు వెక్కివెక్కి ఏడుస్తున్న తీరు అక్కడున్న వారిని కన్నీరుపెట్టించింది.
కాగా.. కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి కుటుంబ సభ్యులను గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, కుడా చైర్మన్ సుందర్‌రాజ్ ఎంజీఎం దవాఖానలో పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వీధి కుక్కల దాడిలో ముక్కుపచ్చలారని బాలుడు మృతి చెందడం మనసును కలిచివేస్తున్నదని చెప్పారు.
బాలుడి తల్లిదండ్రులకు ప్రభుత్వం తరపున రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేసి, అంబులెన్స్‌లో మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తరలించారు.