
ఎస్సై కొట్టాడని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
నేను కొట్టలేదు: ఎస్సై
ఎస్సై కొట్టాడని ఆరోపిస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
కామేపల్లి మండలం పాతలింగాల గ్రామానికి చెందిన అంగిడి దుర్గాప్రసాద్‌ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు.
తనతో వివాహేతర సంబంధం పెట్టుకొని, గర్భవతిని చేశాడంటూ అతనిపై అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత మంగళవారం సాయంత్రం కామేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
దీంతో దుర్గాప్రసాద్‌ను పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో అతను ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
పోలీసులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి వెళ్లేందుకు అతని భార్య ప్రసన్న ఓ ఆటో ఎక్కారు.
మార్గంలో ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించడంతో ఆటో నుంచి ఆమె కిందకు దూకడంతో కన్నుకు బలమైన గాయం కావడంతోపాటు ఎనిమిది పళ్లు విరిగిపోయాయి. ఆమెను కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఫిర్యాదు చేసిన మహిళతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా ఎస్సైతోపాటు సిబ్బంది తనను కొట్టారని దుర్గాప్రసాద్ ఆరోపించాడు.
తన భార్య గురించి ఎస్సై అసభ్యంగా మాట్లాడటం అవమానం భరించలేక ఎలుకల మందు తిన్నానని వివరించాడు.
తనను భర్త సక్రమంగా చూడటం లేదని, ప్రస్తుతం తాను గర్భవతిని అని ఓ మహిళ ఫిర్యాదు చేస్తే ఇద్దరినీ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు.
దుర్గాప్రసాద్ ను కొట్టలేదని, ఆయన భార్య గురించి ఏమీ మాట్లాడలేదని పేర్కొన్నారు.