
ఇంత నిర్లక్ష్యమా?
జిల్లా కేంద్రంలో నాలుగేళ్లుగా సాగుతున్న పనులు
ఎదురుచూస్తున్న నిరుపేదలు
ములుగుజిల్లా : పేదల సొంతింటి కల నెరవేరడం లేదు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకానికి పట్టిన గ్రహణం వీడటంలేదు.
నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన గృహ సముదాయాల నిర్మాణం నిర్లక్ష్యానికి గురవుతోంది. జిల్లాకు 1,600 ఇళ్లు మంజూరైతే 1,217 పూర్తయ్యాయి.
లబ్ధిదారులను ఎంపిక చేసి పంపిణీ కూడా పూర్తిచేశారు. మిగతా నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్నిచోట్ల లబ్ధిదారుల భాగస్వామ్యంతో పనులు చేపట్టగా, మిగతా చోట్ల కాంట్రాక్టర్లకు అప్పగించారు.
ఇదే రీతిన జిల్లా కేంద్రంలో నాలుగేళ్ల క్రితం మొదలుపెట్టిన గృహ నిర్మాణాలు ఒకడుగు ముందుకు.. నాలుగడుగులు వెనక్కి చందంగా సాగుతున్నాయి.
ఇప్పటికీ ఒక్క ఇంటి పని పూర్తికాకపోగా నిరుపేదలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా మండలాల వారీగా ఇళ్ల కేటాయింపులు జరిగిన తర్వాత చివరగా ములుగుకు 96 డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయిం చారు. నిర్మాణ బాధ్యతను రోడ్డు, భవనాల శాఖకు అప్పగించారు.
2019లో ఆన్‌లైన్ టెండర్లు నిర్వహించి 1.5 శాతం లెస్‌కు ఓ కాంట్రాక్టు సంస్థకు కట్టబెట్టారు. నాలుగు బ్లాకుల్లో 24 ఇళ్ల చొప్పున జీప్లస్‌టు పద్ధతిలో ఈ ఇళ్లను నిర్మిస్తున్నారు.
ఒక్కో అంతస్థులో ఎనిమిది ఇళ్లు ఉన్నాయి. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల 4 వేల చొప్పున కేటాయించారు. మొదటి బ్లాకుకు 2019 నవంబరులో, మిగతా మూడు బ్లాకులకు 2020 సెప్టెంబర్‌లో అగ్రిమెంట్ పూర్తయ్యింది.
పెరిగిన ధరలు.. మొండికేసిన కాంట్రాక్టరు
డబుల్ బెడ్‌రూం ఇళ్లకు టెండర్లను 2016 మార్కెట్ రేట్లను పరిగణనలోకి తీసుకొని చేపట్టారు. లాక్‌డౌన్ కారణంగా భవన నిర్మాణానికి ఉపయోగించే ఇసుక, సిమెంట్, ఐరన్ తదితర వస్తువుల రేట్లు అమాంతం పెరిగాయి.
స్టీల్ రేట్లయితే దాదాపు రెట్టింపయ్యాయి. కార్మికుల కూలి రేట్లు కూడా 50 శాతం పెరిగాయి. దీంతో ఇళ్ల నిర్మాణం చేపట్టలేనని కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు.
ఒప్పించే ప్రయత్నం చేసిన సంబంధిత అధికారులు ఎలాగోలా పనులను ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ సంక్షోభ సమయంలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య చొరవ తీసుకోవడంతో ఆమాత్రం పనులు ముందుకు నడుస్తున్నట్లు తెలుస్తోంది.
లబ్ధిదారుల్లో ఆందోళన
ములుగు శివారులోని సర్వేనంబరు 1239లో స్థానిక నిరుపేదలకు 90 గజాల చొప్పున 200కుపైగా నివేశన స్థలాలను ప్రభుత్వం పంపిణీ చేసింది.
ఊరికి చివర ఉన్న ఈప్రదేశంలో లబ్దిదారులు నిర్మాణాలు చేసుకోలేదు.
డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయిస్తామనే హామీతో 2017లో అప్పటి ములుగు సబ్‌కలెక్టర్ వి.పి.గౌతమ్ ఈ పట్టాలను రద్దు చేశారు. అయితే ఏళ్లు గడుస్తున్నా సొంతింటి కల నెరవేరకపోవడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ములుగు జిల్లా ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వరుస ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. కలెక్టరేట్, డబుల్ బెడ్‌రూం నిర్మాణాలు జరిగే ప్రదేశంలో ధర్నా చేశారు.
అర్హులైన వారందరికీ న్యాయం చేస్తామని అధికారులు హామీనివ్వడంతో విరమించారు. గుడిసెలు, అద్దె ఇళ్లలో నివాసం ఉండే పేదలు అధికారులకు పలుమార్లు దరఖాస్తులు చేసుకున్నారు.
అయితే.. లబ్ధిదారుల ఎంపికలో స్పష్టత మాత్రం కనిపించడం లేదు. ఇళ్ల కంటే పేదల సంఖ్య అధికంగా కనిపిస్తుండగా ఎందరికి దక్కుతాయోననే వాదన వినిపిస్తోంది.
ప్రభుత్వం ప్రకటించినట్టు గృహలక్ష్మి పథకంలో రూ.3 లక్షల సాయమైనా చేయాలని పలువురు కోరుతున్నారు.