
మరో సారి పెద్ద మనసు చాటుకున్న ట్రాఫిక్ పోలీసులు
హైదరాబాద్
పోలీస్ అంటే కొంచెం కరుకుగా ఉంటారన్న అభిప్రాయం అందరిలో ఉంటుంది. అయితే, తామూ అందరిలానే అని చాటారు గోషామహల్ ట్రాఫిక్ సీఐ ధనలక్ష్మి.
తన స్టేషన్లో హోంగార్డుగా పనిచేసిన శ్రీశైలం కూతురి వైద్యం కోసం లక్షా 85 వేల రూపాయలను జమ చేసి అందించారు.
వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీశైలం గతంలో గోషామహల్ ట్రాఫిక్ స్టేషన్లో హోంగార్డుగా పని చేశాడు. ఇటీవల బదిలీపై వేరే స్టేషన్‌కు వెళ్లాడు.
కాగా కొన్నిరోజుల క్రితం అతని కూతురు సాన్విక ఆరోగ్యం దెబ్బ తిన్నది. వైద్యులకు చూపించగా చికిత్సకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుందని చెప్పారు.
హోంగార్డుగా సంపాదిస్తున్న జీతం డబ్బుతో కుటుంబాన్ని పోషించుకోవటమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో దిక్కు తోచని శ్రీశైలం సీఐ ధనలక్ష్మికి తన బాధ చెప్పుకున్నాడు.
వెంటనే స్పందించిన ధనలక్ష్మి స్టేషన్ లోని సిబ్బంది అందరినీ సమావేశపరిచి విషయాన్ని వివరించారు. తోచిన సాయం చెయ్యాలని కోరారు.
దీనికి స్పందించిన సిబ్బంది అంతా కలిసి లక్షా 85 వేలు పోగు చేయగా సీఐ ధనలక్ష్మి ఆ మొత్తాన్ని శ్రీశైలంకు అందచేశారు. దీనిపై శ్రీశైలం సీఐతోపాటు సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.