బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఇదే..?

Spread the love

బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఇదే..? సంచలనంగా కేసీఆర్ పథకాలు!
ఏలాగైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు పకడ్బందీగా ప్లాన్ చేస్తున్న బీఆర్ఎస్.. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నది.

ఎన్నికల హామీలు, వాగ్దానాల అస్త్రాలతో అమ్ముల పొదిని సిద్ధం చేసుకుంటున్న గులాబీ బాస్.. ఏ పథకాలను బయటకు బయటకు తీస్తారు? ఓటర్లను ఎలా ఆకట్టుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

మహిళలు, రైతులే టార్గెట్‌గా పలు పథకాలను అమలు చేసే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్టు తెలుస్తున్నది.

వీటికి తోడు ఇప్పటికే అమలవుతున్న స్కీమ్స్‌లోనూ కొన్ని మార్పులు చేయబోతున్నారని టాక్. ఇక దేశం అబ్బురపడే, అడ్డంపడే స్కీం ఒకటి తన దగ్గర ఉందని, అది అమలు చేస్తే ప్రతిపక్షాలు ఆగమవుతాయని ఇప్పటికే ప్రకటించిన కేసీఆర్..

దానిపైనా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇంతకూ ఆ స్కీం ఏంటనేది ఆ పార్టీ నేతలకు సైతం తెలియదు. సరైన టైమ్‌లో దాన్ని బయటకు తీసి విపక్షాలను షాక్‌ ఇవ్వాలని భావిస్తున్నారు కేసీఆర్.

‘హ్యాట్రిక్ పక్కా.. బీఆర్ఎస్‌కు 95 సీట్లు గ్యారంటీ.. సౌత్ ఇండియాలో థర్డ్ టైమ్ సీఎంగా కేసీఆర్ రికార్డు ష్యూర్..’ ఇలాంటి ఎన్నో కామెంట్స్ మంత్రులు, గులాబీ నేతల నుంచి వినిపిస్తున్నాయి.

ఆ ఫలితాల కోసమే బీఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల హామీలు, వాగ్దానాలతో సరికొత్త అస్త్రాల పొదిని సిద్ధం చేసే పని మొదలైంది. ఏ స్కీమ్‌కు ఎలాంటి ఆదరణ ఉంటుందనే చర్చలు షురూ అయ్యాయి.

సరైన టైమ్‌లో పథకాలను బయటకు తీసి విపక్షాలకు షాక్ ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. దేనికెంత వెయిట్ ఉంటుందనే లెక్కలు సైతం ఇంటెలిజెన్స్ వర్గాలు క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నాయి.

ప్రజల స్పందనను పసిగడుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత మదిలో ఉన్న కొన్ని స్కీంలు ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం తెలిసింది.

గులాబీ బాస్ మదిలో (సన్నిహితుల సమాచారం మేరకు)

రైతులకు రూ.2,016 నెలవారీ పింఛన్

10-12 ఎకరాలకు రైతుబంధు సీలింగ్

ఆసరా పింఛనులో (స్త్రీలకు) వెయ్యి పెంపు

ఇండ్లకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు

మహిళలకు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

భూముల రిజిస్ట్రేషన్ల ఫీజులో లేడీస్‌కు 1% రాయితీ

అబ్చురపరిచే పథకం

సరికొత్త సంక్షేమ పథకాలతో పవర్‌లోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నది. ఇప్పుడు అమలవుతున్న వెల్ఫేర్ స్కీమ్‌లకు కొన్ని మార్పులు చేయడంతో పాటు బలమైన హామీని ఇచ్చి ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలపై చర్చలు జరుగుతున్నాయి.

ఏ స్కీమ్‌తో ప్రజల నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుందో ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే ఆరా తీసే పని మొదలుపెట్టాయి.

ఆ వర్గాల నుంచి స్పష్టమైన నివేదిక వచ్చిన తర్వాత వీటిపై బీఆర్ఎస్ అధినేత నిర్ణయం తీసుకునే చాన్స్ ఉన్నది. అబ్బురపడే స్కీమ్‌ను తెస్తానంటూ చాలా ఏండ్లుగా సీఎం కేసీఆర్ ఊరిస్తున్నారు.

ఆయన మనసులో ఉన్న ఆ ‘అబ్బురపడే’ స్కీమ్ ఏంటో పార్టీ నేతలకు కూడా తెలియదు. విపక్షాల చెవిన పడకుండా ఆ స్కీమ్ గోప్యంగానే ఉండిపోయింది.

సరైన సమయంలో ప్రకటించి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను గుక్క తిప్పుకోకుండా చేయాలన్నదే కేసీఆర్ వ్యూహం. ఈసారి బీఆర్ఎస్‌కు గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది.

ముక్కోణపు పోటీ అనివార్యం కావడంతో ఓట్ల చీలికను నివారించడంపైనే ఫోకస్ పెట్టింది. రైతుబంధు, దళితబంధు స్కీమ్‌లతో ఆ సెక్షన్ ఓటర్లకు దగ్గరయ్యామనే భావన ఉన్నప్పటికీ ఈసారి ‘విప్లవాత్మకమైన’ స్కీమ్‌ను తీసుకురావడంపైనే దృష్టి పెట్టింది.

మహిళలే కేంద్రంగా కొన్ని కొత్త స్కీమ్‌లను తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే లోపే ఒకటో రెండో స్కీమ్‌లను అమల్లోకి తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్టు సమాచారం. మిగిలినవాటిని మేనిఫెస్టోలో పెట్టాలన్నది

ఆ పార్టీ భావిస్తున్నది. గత (2018 డిసెంబరు) అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతుబంధు స్కీమ్ అమల్లోకి వచ్చినట్లుగానే ఈసారి ‘రైతు పింఛను’ పథకం ఉనికిలోకి వచ్చే అవకాశం లేకపోలేదు.

రైతులకు పింఛను?

సీఎంకు సన్నిహితంగా ఉన్న వర్గాల సమాచారం ప్రకారం.. పట్టాదారు పాస్‌బుక్ ఉన్న రైతులందరికీ ప్రతి నెలా రూ.2,016 పింఛను ఇచ్చే స్కీమ్‌పై స్టడీ మొదలైంది.

‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదాన్ని ఖరారు చేసినందున దీని ప్రభావం ఎలా ఉంటుంది? అమలుచేయాల్సి వస్తే తగిన గైడ్‌లైన్స్ ఎలా ఉండాలి?

రైతుల ఆదాయం, వారికున్న సాగుభూములే ప్రామాణికంగా ఉండాలా? ప్రభుత్వ ఖజానాపై పడే భారమెంత?.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ స్కీమ్ ద్వారా లబ్ధిపొందే రైతులెంత మంది ఉంటారు?

దీనికి అవసరమైన నిధులను సమకూర్చుకోడానికి ఉన్న మార్గాలేంటి? రైతుబంధు స్కీమ్‌ను 10-12 ఎకరాలకు మాత్రమే పరిమితం చేస్తే సేవ్ అయ్యేదెంత? వంటి అంశాలపై అటు ఇంటెలిజెన్స్ సిబ్బంది, ఇటు ఆర్థిక శాఖ అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రైతుబంధు కోసం సగటున రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. సుమారు 65 లక్షల మంది రైతులు దీని ద్వారా సాయం అందుకుంటున్నారు.

ఇందులో లక్షల మంది మాత్రమే పది ఎకరాలకంటే ఎక్కువ సాగుభూములు ఉన్నారనేది ప్రభుత్వ అంచనా. రైతుబంధు సాయంలో వీరికి కోత పెట్టడం ద్వారా పేద రైతులు సంతృప్త చెందుతారన్నది సర్కారు అభిప్రాయం.

200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు

ఇక గృహ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ సరఫరా చేసే ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం.

ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మాత్రమే నెలకు 50 యూనిట్ల వరకు రాయితీ సౌకర్యం లభిస్తున్నది. ఇకపైన దీనిని అన్ని ఇండ్లకూ వర్తింపజేస్తే పడే ప్రభావంపై ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది.

ఇప్పటికే బీసీ బంధు, గిరిజన బంధు లాంటి స్కీమ్‌లపైనా కేసీఆర్ హామీ ఇచ్చారు.

మహిళలకు సిటీ బస్సుల్లో ఫ్రీ జర్నీ

హైదరాబాద్ సిటీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విషయాన్ని సైతం చర్చలు జరుగుతున్నాయి.

ఇప్పటికే ఢిల్లీ, చెన్నయ్ నగరాల్లో ఈ స్కీమ్ అమలవుతుండగా మహిళల నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ వస్తున్నది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీపై ఈ స్కీమ్ కారణంగా పడే భారమెంతో తెలుసుకోడానికి విశ్లేషణ మొదలైంది.

అందులో భాగంగానే డైలీ బస్ పాస్ రేటులో మహిళలకు 20% డిస్కౌంట్ విధానం పైలట్ బేసిస్‌గా అమలవుతున్నది.

మహిళా ఓటు బ్యాంకును అనుకూలంగా మల్చుకోడానికి ఇది ఏ మేరకు ఉపయోగపడుతుందో, ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో అనే లెక్కలు తీసే పని మొదలైంది.

మరికొన్ని రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. మేనిఫెస్టోలో పెట్టేంతవరకూ వెయిట్ చేయకుండా ఎన్నికల షెడ్యూలు వచ్చే లోపే దీనిని అమల్లోకి తీసుకొచ్చే చాన్స్ ఉన్నది.

మహిళలకు పింఛను పెంపు

రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఒంటరి మహిళలు, వితంతు మహిళలు, వృద్ధ మహిళలు, బీడీ కార్మికులు..

ఇలాంటి కేటగిరీలలో ప్రతి నెలా పింఛన్‌ రూపంలో రూ.2,016 అందిస్తున్నది. ఇకపైన దీనిని రూ.3,016 కు పెంచడం ద్వారా మహిళలకు ఉపయోగకరంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

భూముల రిజిస్ట్రేషన్లలో రాయితీ

భూముల రిజిస్ట్రేషన్లలో ప్రస్తుతం 7.5% మేర స్టాంపు ఫీజు రూపంలో ప్రభుత్వం వసూలు చేస్తున్నది.

మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్లు జరిగినట్లయితే దానిని 6.5 శాతానికే వర్తింప చేయాలన్నది బీఆర్ఎస్ ఆలోచన.

రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గించుకోడానికి ఇకపైన చాలా మంది దీన్ని ఒక ఆప్షన్‌గా ఎంచుకునే అవకాశాలున్నట్టు అంచనా.

ఒకవైపు చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం సీఎం కుమార్తె కవిత డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ తరఫున ఒక స్పష్టమైన హామీని ఈ రూపంలో ప్రకటించడం సందర్భోచితంగా ఉంటుందన్నది గులాబీ పార్టీ అభిప్రాయం.

ఇప్పటికే ఈ తరహా స్కీమ్ మహారాష్ట్రలో సక్సెస్‌ఫుల్‌గా అమలవుతున్నది. అక్కడి క్షేత్రస్థాయి అనుభవాలను బీఆర్ఎస్‌లో ఇటీవల చేరిన నేతలు సీఎం కేసీఆర్‌కు వివరించారు.

అబ్బురపరిచే స్కీం?

ఎన్నికల సంవత్సరం కావడంతో ‘అబ్బురపడే’ స్కీమ్‌ను ప్రకటించాలన్నది కేసీఆర్ ఆలోచన.

గతేడాది తీసుకొచ్చిన రైతుబంధు అద్భుతమైన ఫలితాలు ఇచ్చిందని సంతృప్తి ఆ పార్టీలో ఉన్నది.

ఈసారి కూడా ఇలాంటి ‘విప్లవాత్మకమైన’, ‘అబ్బురపడే’ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నది.

లోతైన అధ్యయనం జరిగిన తర్వాత దీనిపై విపక్షాల ఊహకు కూడా అందని తీరులో కేసీఆర్ ప్రకటించే అవకాశమున్నది.

బీసీ బంధు, గిరిజనబంధు లాంటివి కూడా చక్కర్లు కొడుతున్నాయి.

3,975 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?