
మృతదేహాన్ని తీసుకువచ్చి.. గాంధీలో వదిలేసి..!
గాంధీ దవాఖానలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని వదిలివెళ్లిన నిందితుల గురించి పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 9వ తేదీన అర్ధరాత్రి 1:40 గంటలకు ముగ్గురు వ్యక్తులు అపస్మారకస్థితిలో ఉన్న ఓ వ్యక్తిని క్యాజువాలిటీకి స్ట్రెచర్‌పై తీసుకువచ్చారు.
ఓపీ చిట్టీ తీసుకొని వస్తామని చెప్పి అక్కడి నుంచి పరారయ్యారు. కొద్దిసేపటికి విధి నిర్వహణలో ఉన్న క్యాజువాలిటీ వైద్యులు పరిశీలించగా స్ట్రేచర్‌పై ఉన్న వ్యక్తి అప్పటికే మృతి చెంది ఉన్నాడు.
దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.
మృతుడి ముఖం, చేతులు, తలపై గాయాలున్నాయి. మృతుడికి 30 నుంచి 35 ఏండ్ల వయస్సు ఉంటుందని, కుడి చేతిపై హిందీలో ‘జితేందర్-ఖుషి’ అని పచ్చబొట్టు ఉండటంతో అతడు బెంగాల్ లేదా ఒడిశాకు చెందిన వ్యక్తి అయి ఉంటాడని అనుమానిస్తున్నారు.
పోలీసులు గాంధీ దవాఖాన నుంచి గచ్చిబౌలి వరకు 200 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. మృతుడు అదే పరిసరాలలో ఏదైన నిర్మాణంలో ఉన్న భవనంలో కార్మికుడిగా పనిచేస్తూ ఉండవచ్చని, తోటి కూలీలతో ఏదైన గొడవ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.
ఇదే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నది. ఆదివారం చిలకలగూడ పోలీసులు సీసీటీవీలో రికార్డు అయిన మృతదేహాన్ని వెంట తీసుకువచ్చిన సమయంలో అతడి వెంటఉన్న వ్యక్తి ఫొటోను మీడియాకు విడుదల చేశారు.