
నేటి రాత్రి ఎంసెట్ ఇంజినీరింగ్ ‘కీ’ విడుదల
తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. మూడు రోజులపాటు.. ఆరు విడతల్లో జరిగిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల ప్రాథమిక ‘కీ’ని సోమవారం రాత్రి 8 గంటలకు విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్ కార్యాలయం ప్రకటించింది.
విద్యార్థుల రెస్పాన్స్ పత్రాలను కూడా వెబ్‌సైట్లో ఉంచుతామని, ప్రాథమిక ‘కీ’పై అభ్యర్థనలను 17వ తేదీ రాత్రి 8 గంటలకు వెబ్‌సైట్లోని లింక్ ద్వారా పంపవచ్చని పేర్కొంది.
ఏపీలోని కర్నూలు నగరంలో ఆదివారం ఉదయం ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు హాజరైన ఓ విద్యార్థిని చీటీలపై ఫార్ములాలను రాసుకొచ్చి ఇన్విజిలేటర్లకు చిక్కింది.
మధ్యాహ్నం పరీక్షకు పెద్దపల్లిలో ఓ విద్యార్థి సెల్‌ఫోన్‌ను లోదుస్తుల్లో దాచుకొని వచ్చాడు.
దానిని ఉపయోగించి పరీక్ష రాసేందుకు ప్రయత్నిస్తుండగా ఇన్విజిలేటర్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
వారిద్దరిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు ఎంసెట్ కోకన్వీనర్ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
మొత్తంగా ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 94.11 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. 2,05,351 మందికి 1,95,275 మంది పరీక్ష రాశారు.
అగ్రికల్చర్ విభాగంలో 1,06,514 మంది పరీక్షకు హాజరయ్యారు.