తెలంగాణ కాంగ్రెస్‌లో ఫుల్‌ ‘జోష్‌

Spread the love

తెలంగాణ కాంగ్రెస్‌లో ఫుల్‌ ‘జోష్‌

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయం తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో కొత్త జోష్‌ను తెచ్చింది.

అటు ఇతర రాష్ట్రాల్లో, ఇటు స్వరాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో చాలాకాలంగా ఓటములను భరిస్తూ వస్తున్న టీపీసీసీ నేతల్లో ఈ విజయం మంచి ఉత్సాహాన్ని నింపింది.

ఈ ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతమవుతాయని, తెలంగాణలోనూ తామే అధికారంలోకి వస్తామని ఢంకా బజాయించి చెప్పే స్థాయిలో ఈ ఫలితాలు రాష్ట్ర నేతలకు ఊపు తెచ్చి పెట్టాయి.

అసెంబ్లీ ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొంటామని, బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ మాత్రమేనన్న అంచనాతో ఎన్నికలకు వెళ్తామని ఇక్కడి నేతలు చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ప్రభ మసకబారుతున్న నేపథ్యంలో కర్ణాటకలోనూ ఓడిపోతే తెలంగాణలో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చేదని, కానీ కర్ణాటక ఫలితం ఒక్కసారిగా తెలంగాణ కాంగ్రెస్‌ పరిస్థితిలో మార్పు తెచి్చందని నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఇక పార్టీ నుంచి వలసలు తగ్గుతాయని, అదే సమయంలో పారీ్టలోకి చేరికలు పెరుగుతాయని చెబుతున్నారు.

కలిసికట్టుగా..
కర్ణాటక కాంగ్రెస్‌తో పోలిస్తే తెలంగాణ పారీ్టలో నెలకొన్న గ్రూపు తగాదాలు కూడా ఈ సందర్భంగా చర్చనీయాంశమవుతున్నాయి.

అక్కడ శివకుమార్, సిద్దరామయ్యలు సీఎం కుర్చీ కోసం పోటీపడినప్పటికీ ఎక్కడా అంతర్గత కలహాలు బయటపడకుండా నెట్టుకొచ్చారని, ఐకమత్యంగా పనిచేసి పార్టీని అధికారంలోకి తెచ్చారనే చర్చ జరుగుతోంది.

అధికారం దక్కాలంటే అందరం కలిసి పనిచేయాల్సిందేనని, అదే భావనకు అందరు నేతలు వస్తారని, కలిసికట్టుగా పనిచేసి విజయం సాధిస్తారని టీపీసీసీ నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.

జోడో యాత్రపై ఆశలు
కర్ణాటకలో రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర నిర్వహించిన 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15 చోట్ల కాంగ్రెస్‌ గెలుపొందడం తెలంగాణ పార్టీ నేతల్లోనూ ఉత్సాహాన్ని నింపుతోంది.

గత అక్టోబర్, నవంబర్‌లో తెలంగాణలోనూ రాహుల్‌ జోడో యాత్ర జరిగింది.

రాష్ట్రంలో 19 అసెంబ్లీ, 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ యాత్ర జరగ్గా, ఆయా స్థానాల్లో మంచి ఫలితాలు వస్తాయనే అంచనాలు అక్కడి నేతల్లో మొదలయ్యాయి.

నారాయణ పేట, దేవరకద్ర, మహబూబ్‌ నగర్, జడ్చర్ల, షాద్‌ నగర్, రాజేంద్రనగర్, బహుదూర్‌పుర, చారి్మనార్, గోషామహల్, నాంపల్లి, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, శేరిలింగపల్లి, పఠాన్‌చెరు, సంగారెడ్డి, ఆందోల్, నారాయణ్‌ ఖేడ్, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా జోడో యాత్ర సాగింది.

కర్ణాటక ఫలితాలను బట్టి ఆయా స్థానాల్లో కొంచెం కష్టపడితే విజయం సాధించగలమనే ధీమా టీపీసీసీ నేతల్లో వ్యక్తమవుతోంది.

మొత్తంమీద గెలుపునకు మొహం వాచినట్టు ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు సరిహద్దు కర్ణాటకలో దక్కిన విజయం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పినట్టు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందని అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

1,795 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?