
రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం
ఆనందపురం మండలం దుక్కవానిపాలెం టోల్‌గేట్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనకాపల్లి జిల్లా గొలుగొండ పోలీస్‌స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ గవిరెడ్డి దేవుడుబాబు(47) మృతి చెందారు.
ఈ ఘటనపై సబ్బవరం పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న దేవుడుబాబు తమ్ముడు అప్పలనాయుడు ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జిల్లా కోర్డులో వారెంట్లు, సమన్లు తదితర విధులు నిర్వర్తించే దేవుడుబాబు శుక్రవారం ఉదయం కె.కోటపాడు మండలం చంద్రయ్యపేటలో తన ఇంటి నుంచి కోర్టుకు బయలు దేరారు.
అదే సమయంలో తనకు వరసకు సోదరుడైన సింగంపల్లి అప్పలనాయుడు కూడా కారులో విశాఖ వస్తున్నందున.. అతనితో పాటు పెందుర్తి మీదుగా ఆనందపురం వైపు వస్తున్నారు.
దుక్కవానిపాలెం టోల్‌గేట్ వద్ద వాటర్‌బాటిల్ కొనుగోలుకు అతను కారు నుంచి కిందకు దిగారు.
తిరిగి కారు ఎక్కే సమయంలో వెనుక నుంచి మినీ లగేజీ వాహనం కారుతో పాటు దేవుడుబాబును బలంగా ఢీకొంది.
ఈ ప్రమాదంలో కింద పడిన హెడ్ కానిస్టేబుల్ తలకు బలమైన గాయమై కుడిచేయి విరిగిపోయింది. వెంటనే సంగివలస అనిల్ నీరుకొండ ఆస్పత్రికి అతన్ని తరలించగా..
అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.