కలెక్టరేట్‌ సమీపంలో విశ్రాంత అధికారి ఆత్మహత్యాయత్నం

Spread the love

భూమి కోసం విశ్రాంత అధికారి ఆత్మహత్యాయత్నం
పెద్దపల్లి కలెక్టరేట్‌ సమీపంలో ఘటన

పెద్దపల్లి కలెక్టరేట్‌ సమీపంలో శుక్రవారం ఓ విశ్రాంత అధికారి ఒంటికి నిప్పంటించుకోవడం కలకలం రేపింది.

బాధితుడు తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం… ధర్మారం మండలం ఖిలావనపర్తికి చెందిన మెట్‌పల్లి రామచందర్‌రావు(78) మధ్యాహ్నం 3.30 గంటలకు పెద్దపల్లి డీసీపీ కార్యాలయ ద్వారం వద్ద ఒంటికి నిప్పంటించుకున్నారు.

పోలీసులు క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌కు పంపించారు. రామచందర్‌రావుకు భార్య రమాదేవి, కొడుకులు సందీప్‌రావు, ప్రణీత్‌రావు ఉన్నారు. నలభై ఏళ్ల కిందటే వీరి కుటుంబం హైదరాబాద్‌లోని అల్వాల్‌కు వెళ్లిపోయింది.

రామచందర్‌రావు సచివాలయంలో పీఏవో(పేమెంట్స్‌ అకౌంట్స్‌ అధికారి)గా ఉద్యోగ విరమణ చేశారు. రామచందర్‌రావుకు మహేశ్వర్‌రావు, ప్రతాప్‌రావులు సోదరులు. వీరి కుటుంబానికి ఖిలావనపర్తిలో 12 ఎకరాల భూమి ఉండేది. అందులో తన పేరిట ఉన్న భూమిని సోదరులు తనకు తెలియకుండా విక్రయించి మోసగించారని రామచందర్‌రావు ఆరోపణ.

నెల రోజుల కిందట స్వగ్రామానికి వచ్చి సర్పంచి భర్తను కలిశారు. మహేశ్వర్‌రావు తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నందున ఆయన కోలుకోగానే పంచాయితీ పెడదామని చెప్పడంతో వెనుదిరిగారు.

వారం కిందట కలెక్టరేట్‌లో ఫిర్యాదు

ఈ నెల 5న ధర్మారం తహసీల్దారు కార్యాలయానికి వెళ్లిన రామచందర్‌రావు తన పేరిట ఉండాల్సిన భూములపై ఆరా తీశారు. తర్వాత పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుపత్రం అందజేశారు.

అక్కడి నుంచి పెద్దపల్లి కలెక్టరేట్‌లోని ఇన్‌వార్డుకు వెళ్లి ఫిర్యాదు చేశారు. తిరిగి శుక్రవారం పెద్దపల్లికి వచ్చిన రామచందర్‌రావు డీసీపీ కార్యాలయ ద్వారం వద్ద ఆత్మహత్యాయత్నం చేశారు.

పెద్దపల్లి కలెక్టర్‌ డా.సర్వే సంగీత మాట్లాడుతూ… ”రామచందర్‌రావు ఈ నెల 5న కలెక్టరేట్‌ ఇన్‌వార్డులో ఫిర్యాదు చేశారు. నన్ను నేరుగా సంప్రదించలేదు. శుక్రవారం జరిగిన ఘటనకు కుటుంబ సభ్యుల మధ్య వివాదమే కారణం” అని స్పష్టంచేశారు.

1,890 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?