
రూ.40 వేలు లంచం డిమాండు.. అనిశా వలలో కంభం సబ్ రిజిస్ట్రార్
ప్రకాశం జిల్లా కంభం సబ్ రిజిస్ట్రార్ శ్రీరామమూర్తి, డాక్యుమెంట్ రైటర్ బి.శ్రీరామచంద్రరావు బుధవారం అనిశా అధికారులకు చిక్కారు.
అవినీతి నిరోధకశాఖ (అనిశా) ఒంగోలు డీఎస్పీ వి.శ్రీనివాసరావు వివరాల ప్రకారం.. కందులాపురం పంచాయతీకి చెందిన సాగం కృష్ణ రంగారెడ్డి తన భార్య జ్యోతి పేరుతో 205 గజాల స్థలం రిజిస్ట్రేషన్ చేసేందుకు వెళ్లగా సబ్ రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్‌తో కలిసి రూ.40 వేలు లంచం డిమాండు చేశారు.
ఆ తర్వాత రూ.15 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బాధితుడు ఈ నెల 8న అనిశా అధికారులను ఆశ్రయించడంతో వారిని పట్టుకునేందుకు ప్రణాళిక రూపొందించారు.
ఆ మేరకు కృష్ణ రంగారెడ్డి బుధవారం నగదును డాక్యుమెంట్ రైటర్‌కు అందజేయడంతో ఆయన రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన దస్త్రాలను కార్యాలయంలోకి పంపించారు.
మధ్యాహ్నం అనిశా అధికారులు కార్యాలయానికి వచ్చి సబ్ రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. లంచం తీసుకున్నట్లు నిర్ధారించుకొని వారి అరెస్టు చేశారు.
నగదు స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ చెప్పిన మేరకే డబ్బు వసూలు చేసినట్లు డాక్యుమెంట్ రైటర్ ఒప్పుకొన్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను గురువారం నెల్లూరు కోర్టులో హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు.