ప్రత్యేక న్యాయస్థానం ఎదుటకు ఇమ్రాన్‌ ఖాన్‌..!

Spread the love

ప్రత్యేక న్యాయస్థానం ఎదుటకు ఇమ్రాన్‌ ఖాన్‌..!

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)

పాక్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్ ను ఎట్టకేలకు ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు. ఆయన్ను 14 రోజుల రిమాండ్‌కు ఇవ్వాలని ఎన్‌ఏబీ కోరింది.

బుధవారం ఇస్లామాబాద్‌ పోలీస్‌ లైన్స్‌లోని ప్ర కార్యాలయంలోని కొత్త అతిథి గృహాన్ని న్యాయస్థానంగా మార్చేశారు. ఇక్కడ ఖాన్‌పై నమోదైన రెండు కేసులను విచారించనున్నారు.

యాంటీ అకౌంటబిలిటీ కోర్టు నెంబర్‌ 1 ఈ న్యాయస్థానంలో జడ్జిగా మహమ్మద్‌ బషీర్‌ వ్యవహరించారు. గతంలో నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె మరియంపై నమోదైన అవినీతి కేసులను ఈ న్యాయమూర్తే విచారించారు. అప్పట్లో ఆమెకు శిక్షపడింది.

అల్‌-ఖాద్రీ ట్రస్ట్‌ భూములపై..
విచారణ సందర్భంగా ఖాన్‌ను 14 రోజులపాటు రిమాండ్‌కు ఇవ్వాలని ఎన్‌ఏబీ (నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో) లాయర్లు కోరారు.

దీనిని ఇమ్రాన్‌ తరపున న్యాయవాద బృందం తీవ్రంగా వ్యతిరేకించింది. అంతేకాదు.. తక్షణమే ఇమ్రాన్‌ను విడుదల చేయాలని కోరింది. అనంతరం న్యాయమూర్తి విరామం తీసుకొన్నారు.

వాస్తవానికి నేడు ఇమ్రాన్‌ను కలిసేందుకు న్యాయసలహా బృందానికి తొలుత అనుమతులు లభించలేదు.. కానీ, కొద్దిసేపటి తర్వాత ఖాన్‌ను కలిసేందుకు వారిని అనుమతించారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ మరో కేసులో..
జిల్లా సెషన్స్‌ కోర్టు జడ్జి హుమాయున్‌ దిలావర్‌ ఎదుట కూడా హాజరుకానున్నారు. ప్రభుత్వానికి చెందిన బహుమతులు విక్రయించిన విషయంలో ఇమ్రాన్‌ ఎదుర్కొంటున్న ఆరోపణలపై ఇక్కడ విచారించనున్నారు.

ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన…
పీటీఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు విచారణ కేంద్రం వద్ద గుమిగూడకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

దీంతో పాటు మీడియా ప్రతినిధులకు కూడా ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. మరోవైపు పీటీఐ ఉపాధ్యక్షుడు షా మహమూద్‌ ఖురేషీ, కార్యదర్శి అసద్‌ ఉమర్‌ను కూడా పోలీసులు అడ్డుకొన్నారు.

దీంతో వీరు ఇస్లామాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేయడానికి యత్నించారు. కానీ, అంతకు ముందే ఉగ్రవాద వ్యతిరేక బృందం పోలీసులు అసద్‌ ఉమర్‌ను అరెస్టు చేశారు.

ఇక పాక్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో భారీ ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. దాదాపు 1000 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడ జరిగిన అల్లర్లలో దాదాపు 130 పోలీసు అధికారులు గాయపడ్డారు.

అవినీతి కేసులో..
పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను మంగళవారం పారామిలిటరీ రేంజర్లు అరెస్టు చేశారు. ఓ అవినీతి కేసుకు సంబంధించి ఇస్లామాబాద్‌ హైకోర్టులో విచారణకు హాజరైన ఆయనను కోర్టు బయట అదుపులోకి తీసుకున్నారు.

ఐఎస్‌ఐ కనుసన్నల్లోని సైన్యం తనను చంపడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించిన నేపథ్యంలో పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ (పీటీఐ) అధినేత అయిన 70 ఏళ్ల ఇమ్రాన్‌ను అరెస్టు చేయడం గమనార్హం.

ఆయన అరెస్టుతో దేశవ్యాప్తంగా విధ్వంసకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆర్మీ ప్రధాన కార్యాలయంపైనా ఇమ్రాన్‌ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు.

లాహోర్‌ కోర్‌ కమాండర్‌ ఇంట్లో నుంచి నెమళ్ల అపహరణ..
ఇమ్రాన్‌ అరెస్టుతో ఆగ్రహించిన పీటీఐ కార్యకర్తలు లాహోర్‌లోని కోర్‌కమాండర్‌ ఇంటిపై దాడిచేశారు. అక్కడి తలుపులు బద్దలుకొట్టి ఇంట్లోకి చొరబడ్డారు.

అక్కడ ఉన్న నెమళ్లను కొందరు కార్యకర్తలు అపహరించి ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వీటిని ఎందుకు తీసుకెళుతున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘ప్రజల డబ్బుతో కొన్నవి’ అని వారు జవాబివ్వడం గమనార్హం.

1,152 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?