
ఆర్టీసీ బస్సులో సీటు కోసం గొడవ, యువతిపై ఎస్ఐ దాడి – జగిత్యాలలో ఉద్రిక్తత!
ఆర్టీసీ బస్సులో సీటు కోసం గొడవ జరగగా.. ఎస్సై ఓ యువతిపై చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది. ఆపై ఎస్సై భార్య సైతం బాధితురాలి తల్లిపై దాడికి దిగడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
బస్సులో సీటు కోసం తమపై ఎస్ఐ, ఆయన భార్య దాడి చేశారని, బస్సు ఆపి బెదిరించారని బాధిత యువతి, ఆమె తల్లి ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేయాలని రోడ్డుపై నిరసన తెలపడంతో జగిత్యాలలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి వీరిని అడ్డుకున్నారు. పోలీసులు బాధితులకు న్యాయం చేయకుండా తోటి పోలీసును వెనకేసుకొస్తున్నారని యువతి బంధువులు ఆరోపించారు.
బెజ్జంకి నుండి యువతి (22 సం.లు), MBA విద్యార్థిని, ఆమె తల్లి ఆర్టీసీ బస్సులో జగిత్యాలకి వస్తున్నారు. కరీనంనగర్ లో ఒక మహిళ బస్సులోకి ఎక్కింది.
తను కూడా జగిత్యాలకు వస్తుంది. యువతి, తన తల్లి ఇద్దరు కూర్చున్న సీటు వద్ద వెళ్లి ఖాళీగా ఉన్న మూడవ సీటులో కూర్చుంది.
పదేపదే మరికొంత జరగమని అనడంతో వారి మధ్య గొడవ జరిగింది. ఒకరికొకరు మాటలు అనుకున్నారు. ఆ తర్వాత ఆ మహిళ వెనకి సీటులోకి వెళ్లి కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత మళ్లీ వాళ్ల సీటు దగ్గరికి వచ్చి కూర్చుని, నా భర్త ఏస్సై.
నేను నా భర్తకు ఫోన్ చేశాను. అతను వచ్చి మీ సంగతి చూస్తాడు అని బెదిరించింది. వారు జగిత్యాల బస్టాండులో దిగినంక మాట్లాడుకుందాం అని అన్నారు.
సినీ ఫక్కీలో ఎస్సై అనిల్ ఏంట్రీ
బస్సు జగిత్యాల పట్టణంలోని బస్సు డిపో దగ్గరికి చేరుకోగానే కారుతో అడ్డగించి సివిల్ డ్రెస్సులో ఎస్సై అనిల్, డ్యూటీ డ్రెస్ లో ఒక కానిస్టేబుల్ బస్సు ఆపాడు.
బస్సులో ఎక్కి తన భార్యతో ఎవరు నీతో గొడవ పెట్టుకున్నవారని అడిగాడు. తన భార్య యువతి, ఆమె తల్లిని చూపించడంతో వారి దగ్గరికి వచ్చి అసభ్యంగా మాట్లాడుతూ బెదిరింపులకు దిగాడు.
దీంతో భయపడ్డ ముస్లిం యువతి తన ఫోన్ లో వీడియో చాట్ ఆన్ చేసి ఫ్రెండ్ నెంబర్ కి పెట్టింది. ఒక్కసారిగా కోపంతో రగిలిపోయిన ఎస్ఐ అనిల్ ఆ అమ్మాయి మీద చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది.
బస్సు నుండి కిందకి దించేసి సైతం తమపై దాడి చేశాడని బాధితులు ఆరోపించారు. అనిల్ భార్య ఆ యువతి తల్లి మీద చేయిచేసుకుంది. అక్కడ అంతమంది జనాలు ఉన్నా చూస్తున్నారే కానీ ఏవరూ ఆపలేదు.

చివరికి ఒక మహిళ ధైర్యం చేసి ఎస్ఐ అనిల్ ని నిలదీసింది. దీంతో ఆ అమ్మాయి పగిలిన ఫోన్, బస్సు టికెట్లు, పర్సు లాక్కొని అక్కడి నుండి వెళ్లిపోయాడు.
మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ సంఘటన జరిగింది. బాధితులు జగిత్యాల టౌన్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు.
నిన్న రాత్రి 12 గంటల వరకు వారు పోలీసు స్టేషను దగ్గర ఉన్నారు. కానీ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్సై అనిల్, కానిస్టేబుల్ ని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మహిళల మీద పోలీసులు దాడి చేసే హక్కు ఎవరిచ్చారు అని బాధితులు, వారి కుటుంబసభ్యులు ప్రశ్నించారు.
ఎస్సై అనిల్, కానిస్టేబుల్ ఇద్దరి మీద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. వీరిద్దరిని సర్వీసు నుండి వెంటనే తొలిగించాలని డిమాండ్ చేస్తున్నారు.
కవిత వద్దకు చేరిన పంచాయితీ..
పోలీసులు కేసు నమోదు చేయడం లేదని, ఎస్సై అనిల్ పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు బాధితురాలి కుటుంబ సభ్యులు బయల్దేరగా వారిని పోలీసులు అడ్డుకున్నారు.
అయినా వారు వెనక్కి తగ్గకుండా అతికష్టమ్మీద ఎమ్మెల్సీ కవితను కలిసి తమ బాధను చెప్పుకున్నారు. ఈ విషయం ఎక్కడికి దారి తీస్తుందోనని, వారికి సర్దిచెప్పే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.