
కొట్టుకోబోయిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యే..నువ్వెంతంటే..నువ్వెంత అంటూ..
ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన ఇద్దరు ఎమ్మెల్యేలు అందరూ చూస్తుండగానే వాగ్వాదానికి దిగారు.
నువ్వెంత అంటే నువ్వెంత అంటూ మాట మాట పెరిగి కొట్టుకోబోయారు.
అది కూడా ఓ మంత్రి ముందు జరగడం గమనార్హం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే పొందేం వీరయ్య పాల్గొన్నారు.
ఈ క్రమంలో వివాదం చెలరేగగా సెక్యూరిటీ అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలోని లక్ష్మినగరంలో ప్రభుత్వ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే పొందేం వీరయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేగా కాంతారావు మాట్లాడుతూ కేసీఆర్ పై ప్రశంసలు గుప్పించారు.
అలాగే భద్రాచలంలో ఈసారి బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
దీనితో ఆగ్రహానికి గురైన పొందేం వీరయ్య రేగా కాంతారావుతో వాగ్వాదానికి దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ మాట మాట పెరిగింది.
ఒకరికొకరు దగ్గరకు వచ్చి కొట్టుకోబోయారు. ఇంతలో అప్రమత్తమైన సెక్యూరిటీ ఇరువురిని అడ్డుకున్నారు. దీనితో వివాదం సద్దుమణిగింది.