కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలి.. హ్యాట్రిక్‌ కొట్టాలి

Spread the love

కెసిఆర్ తో పెట్టుకుంటే వేటాడుదాం

కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలి.. హ్యాట్రిక్‌ కొట్టాలి

పెద్దపల్లి, మంచిర్యాల పర్యటనలో కేటీఆర్‌ వ్యాఖ్యలు

పెద్దపల్లి:మంచిర్యాల తెలంగాణతో గోక్కుంటే, కేసీఆర్‌తో పెట్టుకుంటే ఎక్కడి దాకానైనా వేటాడుతాం. ప్రైవేటీకరణపై పచ్చి అబద్ధాలు మాట్లాడిన ప్రధాని మోదీని ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం.

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మితే కొందరు మాట్లాడవచ్చు, మాట్లాడకపోవచ్చు. కానీ, సింగరేణిని అమ్మే ప్రయత్నం చేస్తే మాత్రం రామగుండం, ఈ బొగ్గు గని మొత్తం అగ్నిగుండమవుతుంది’’ అని మంత్రి

కేటీఆర్‌ హెచ్చరించారు. సోమవారం పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో, మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించి, శంకుస్థాపన చేశారు.

అనంతరం నిర్వహించిన సమావేశాల్లో మాట్లాడారు. గోదావరిఖని నిర్వహించిన నవ నిర్మాణ సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ, ‘‘సింగరేణి మనుగడ సాధించాలంటే మన గోడు వినేటోడొకడు ఢిల్లీలో ఉండాలి.

ఈ గనులను కాపాడుకోవాంటే ఒక్క బీజేపీ అభ్యర్థికి కూడా ఓటు వేయొద్దు. డిపాజిట్లు గల్లంతు చేసి గుండు కొట్టించి అవతలికి పంపించాలి’’ అని పిలుపునిచ్చారు.

ప్రధాని మోదీ ప్రతి ఇంటికీ రూ.15 లక్షలు ఇస్తానన్నారని, కానీ.. దోస్త్‌ అకౌంట్‌లో వేశారని ఆరోపించారు. ప్రధాని, అదానీ.. అవినీతికి అవిభక్త కవలలు అని అన్నారు. రామగుండంలో ఒకప్పుడు జూనియర్‌ కళాశాల, డిగ్రీ కళాశాల కోసం పోరాటం చేశారని, కానీ.. ఇక్కడ సీఎం కేసీఆర్‌ మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేశారని తెలిపారు.

కాలంతో పోటీ పడి కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌ నిర్మించారని, గోదావరికి 82 అడుగుల దిగువ నుంచి నీటిని 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండ పోచమ్మలోకి ఎత్తిపోస్తున్నారని కొనియాడారు.

టూరిస్టులు వచ్చిపోతున్నారు..

కొందరు టూరిస్టులు తెలంగాణకు వచ్చి పోతున్నారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఉద్యమకారుల రక్తాన్ని కళ్ల చూసిన పార్టీ కాంగ్రెస్‌ అని విమర్శించారు. నెత్తురు పారిన నేలలో ఇప్పుడిప్పుడే నీళ్లు పారుతున్నాయని, కన్నీళ్లు లేకుండా పోతున్నాయని అన్నారు.

కాంగ్రెసోళ్ల మాటలు నమ్మి ఆగం కావద్దన్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు సింగరేణిలో 15 వేల మందికి డిపెండెంట్‌ ఉద్యోగాలు కల్పించారని, 4,207 మందికి కొలువులు కల్పించారని, 548 మంది కార్మికులను తిరిగి కొలువులోకి తీసుకున్నారని, ఇళ్లు కట్టుకునేందుకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను ఇప్పిస్తున్నామని వివరించారు.

బెల్లంపల్లిలో 7వేల మందికి పట్టాలు ఇచ్చామన్నారు. సింగరేణిపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని, ప్రభుత్వ కంపెనీకి గనులను నామినేషన్‌ పద్ధతిలో ఇవ్వాలని తాము కోరినా స్పందించలేదన్నారు.

కానీ, గుజరాత్‌లో మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ అడిగితే నాలుగు బొగ్గు గనులను మోదీ రాసిచ్చారని, మనల్ని మాత్రం వేలం పాటల్లో పాల్గొనాలని చెబుతున్నారని విమర్శించారు.

సింగరేణిని అమ్మబోమని మోదీ గాలిమాటలు చెప్పారని, ఆ తర్వాత నాలుగు బొగ్గు గనులను వేలానికి పెట్టారని ఆరోపించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానన్నారని, మరి 18 కోట్ల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.

ఆ రెండు పార్టీలది అవినీతి పాలన..

కాంగ్రెస్‌, బీజేపీల పాలన అంతా అవినీతేనని కేటీఆర్‌ ఆరోపించారు. బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రియాంకగాంఽధీ తెలంగాణకు వచ్చి కేసీఆర్‌ది కుటుంబపాలన అంటూ విమర్శించారని,

మరి నెహ్రూ నుంచి ఇందిర, రాజీవ్‌గాంధీ.. వీరంతా ఎవరని ప్రశ్నించారు. అవినీతి గురించి ప్రియాంక మాట్లాడటం విడ్డూరమన్నారు.

ఛత్తీ్‌సగఢ్‌లో కాంగ్రెస్‌, మహారాష్ట్రలో బీజేపీ-శివసేన అధికారంలో ఉన్నాయని, ఆ రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రగతి పథంలో మరింతగా దూసుకెళ్లాలంటే కేసీఆర్‌ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని అన్నారు.

బెల్లంపల్లి నియోజకవర్గంలో రూ.114.89 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినట్లు చెప్పారు.

కేసీఆర్‌ ప్రజలకు ఏం చేశారంటూ బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు ప్రశ్నిస్తున్నారని.. 55 ఏళ్లలో చేయని పనుల్ని తాము 9 ఏళ్లలో చేశామని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంతర్‌రెడ్డి ఇంతకాలం గుడ్డి గుర్రాల పళ్లు తోమాడా? అంటూ ధ్వజమెత్తారు.

ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియని బండి సంజయ్‌ మంచోడో, పిచ్చోడో అర్థం కాదన్నారు. అనంతరం బెల్లంపల్లిలోని సింగరేణి స్థలాల్లో నివసిస్తున్న ఏడు వేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీని ప్రారంభించారు.

కాసిపేట మండలం దేవాపూర్‌లోని సిమెంట్‌ ఫ్యాక్టరీలో రూ.2 వేల కోట్లతో రెండో యూనిట్‌ విస్తరణ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. బెల్లంపల్లిలో 350 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ప్రారంభించారు.

పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయ భవనాన్ని హోం మంత్రి మహమూద్‌ అలీతో కలిసి కేటీఆర్‌ ప్రారంభించారు.

ఈ కార్యక్రమాల్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ వెంకటేశ్‌ నేత, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

3,214 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?