
ఆగ్రహించిన రైతన్న
డబ్బులిచ్చినా… లారీలు రావడం లేదంటూ రాస్తారోకో
ధర్నాలో చిక్కుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా
మండల కేంద్రమైన కొల్చారంలో ధాన్యం తూకం చేసి వారం రోజులైన లారీలు రాకపోవడంతో ఆగ్రహించిన అన్నదాత రోడ్డెక్కి రాస్తారోకో చేశారు.
కొల్చారం సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి లారీలు సరిగా రావడం లేదు.
ఇప్పటికే వడగళ్లు, అకాల వర్షంతో అన్నమో రామచంద్రా అంటూ అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
కొనుగోలు కేంద్రం వద్దకు వందలాది మంది రైతులు తమ ధాన్యాన్ని తీసుకొచ్చి ఆరబెట్టారు. ధాన్యం తూకం చేసినా లారీలు అక్కడికి రావడం లేదు.
ప్రభుత్వం ఇచ్చే ధరకు అదనంగా లారీకి రూ.2వేలు ఇచ్చినా లారీలు రావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
పక్కనే ఉన్న వరిగుంతం గ్రామానికి లారీలు వెళ్తుండడంతో కొల్చారం సహకార సంఘం పాలకవర్గం పట్టించుకోవడం లేదని రైతులు మంగళవారం మెదక్ హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
ఈ రాస్తారోకోలో కలెక్టర్ వాహనం కూడా నిలిచిపోయింది. విషయం తెలిసిన కొల్చారం ఎస్సై సార శ్రీనివాస్ గౌడ్, సహకార సంఘం అధ్యక్షులు మనోహర్, కౌడిపల్లి ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ దేవన్న శేఖర్ రైతుల దగ్గరకు వెళ్లి వారికి నచ్చజెప్పారు.
రెండు రోజుల్లో లారీల సమస్యను తీరుస్తామని సొసైటీ చైర్మన్ రైతులకు హామీ ఇచ్చారు. దీంతో రైతులు రాస్తారోకోను విరమించారు.