
ముగ్గురి ప్రాణం తీసిన ఓవర్‌టేక్
లారీని దాటే క్రమంలో ఆర్టీసీ బస్సును ఢీకొన్న ట్రాలీ ఆటో
అక్కడికక్కడే దంపతుల మృతి
చికిత్స పొందుతున్న కూతురు
మృతి, విషమంగానే తల్లి ఆరోగ్యం
ఏడుపాయల నుంచి తిరిగివస్తుండగా ఘటన
ఓవర్ టేక్ ముగ్గురి ప్రాణం తీయగా, మరో ఐదుగురిని గాయాలపాలు చేసింది. దైవదర్శనం చేసుకుని సంతోషంగా తిరిగి వస్తుండగా, పెను విషాదం చోటుచేసుకుంది.
ఆటోడ్రైవర్ కుటుంబం చిన్నాభిన్నమైంది. తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
జీడిమెట్ల సూరారం సాయిబాబానగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ సప్పిడి నాగలింగరాజు(36), అతని భార్య రమ(33) వీరి పిల్లలు ధరణి, వెంకటలక్ష్మి, అమృతతోపాటు పక్కింటి బత్తిని లత, ఆమె కూతుళ్లు వైశాలి, అవంతిక ట్రాలీ ఆటోలో గురు వారం ఏడుపాయల వనదుర్గ ఆలయానికి వచ్చారు.
రాత్రి అక్కడే ఉండి శుక్రవారం మధ్యా హ్నం తిరుగుప్రయాణం అయ్యారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్‌గేట్ సమీపంలోకి రాగానే ఆటో నడుపుతున్న నాగలింగరాజు ముందు వెళుతున్న లారీని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నం చేశాడు.
ఎదురుగా మెదక్ డిపోనకు చెందిన పల్లెవెలుగు బస్సు నర్సాపూర్ నుంచి మెదక్‌వైపు వస్తుండగా, ఆటో బస్సును ఢీకొట్టింది. దీంతో ఆటోడ్రైవర్ నాగలింగరాజు, అతని భార్య రమకు తీవ్ర గాయాలై, అక్కడికక్కడే మృతి చెందారు.
వీరి పిల్లలు ధరణి, వెంకటలక్ష్మి, అమృతతోపాటు పక్కింటి బత్తిని లత, ఆమె కూతుళ్లు వైశాలి, అవంతికకు కూడా గాయాలయ్యాయి.
అయితే వీరిలో బత్తిని లత, ఆమె కూతురు వైశాలి పరిస్థితి విషమంగా ఉండగా, హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ వైశాలి(16) మృతిచెందింది.
జేసీబీ సాయంతో మృతదేహం వెలికితీత
ఆర్టీసీ బస్సును వేగంగా ఢీకొనడంతో ఆటో ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. అందులోనే ఆటోడ్రైవర్ నాగలింగరాజు మృతదేహం ఇరుక్కుపోయింది.
సంఘటన స్థలాన్ని తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి, నర్సాపూర్ సీఐ షేక్‌లాల్ మదార్, ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి సందర్శించారు.
మృతదేహాన్ని జేసీబీ సాయంతో ఆటోలో నుంచి బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
108లో బాధితుల తరలింపు
ప్రమాదం జరిగిన సమయంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సార రామాగౌడ్, హరిచంద్‌తండా సర్పంచ్ లక్యనాయక్, రాజిపేట మాజీ సర్పంచ్ పాష ఇతర నాయకులు అటుగా వెళుతున్నారు.
వెంటనే వారు గాయపడిన బాధితులను ఆటోలో నుంచి దించి 108లో నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద వివరాలు తెలుసుకున్న సునీతారెడ్డి
అటుగా వెళుతున్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి డీఎస్పీని అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.
బాధితులకు నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.