
పెళ్లి పేరిట వేధింపులు
మనస్తాపంతో యువతి ఆత్మహత్య
పెళ్లయిన వ్యక్తి దురాగతం, కేసు నమోదు
నేను ప్రేమించా.. నువ్వెలా పెళ్లి చేసుకుంటావ్?: ఇప్పటికే పెళ్లైన యువకుడి వేధింపులు
కొద్దిరోజుల్లో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన యువతిని.. ఇప్పటికే పెళ్లయిన ఓ యువకుడు వేధించడం, కుదిరిన పెళ్లిని చెడగొట్టడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో చోటు చేసుకుంది.
ఎస్సై కోన వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. బైరంపల్లికి చెందిన లక్ష్మయ్య కుమార్తె అనూష (22) డిగ్రీ చదివి ఇంటి వద్దనే ఉంటోంది. ఆమె తల్లి చాలాకాలం క్రితం మృతి చెందింది.
ఇటీవలే ఆమెకు ఓ కానిస్టేబుల్‌తో నిశ్చితార్థం జరిగింది.
అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ యువతితో నిశ్చితార్థం చేసుకున్న కానిస్టేబుల్‌కు ఫోన్‌చేసి తాను ప్రేమించిన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావని నిలదీయడంతో పెళ్లి ఆగిపోయింది.
శ్రీకాంత్‌కు ఇప్పటికే పెళ్లవడంతో పాటు ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లి నిలిచిపోవడంతో మనస్తాపం చెందిన యువతి శుక్రవారం రాత్రి గదిలో ఉరి వేసుకుంది.
కుటుంబ సభ్యులు తెల్లవారి చూసే సరికి మృతి చెందింది. మృతిరాలి సోదరుడు రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.