
కామారెడ్డి జిల్లాలో అమానుష ఘటన.. ఆస్తి కోసం తల్లిపై దాడి
కామారెడ్డి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లిపైనే కుమారుడు, కుమార్తెలు దాడి చేశారు.
బాధిత వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి పట్టణానికి చెందిన కిష్టవ్వ(70)కు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
వీరిలో ఒక కుమార్తె మృతి చెందింది. ఇక ఇద్దరు కుమార్తెలు, కుమారుడు కామారెడ్డి పట్టణంలోనే వివిధ ప్రాంతాల్లో నివపిస్తున్నారు.
అయితే కిష్టవ్వ గత నెల 21న అస్వస్థతకు గురి కాగా, చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమెను చేర్పించారు.
అయితే కిష్టవ్వ పేరు మీద ఇల్లు, బ్యాంకు ఖాతాలో రూ. 1.70 లక్షల నగదు ఉంది. ఈ ఆస్తికి నామినీగా బంధువు ఉన్నాడు.
ఇల్లు, బ్యాంకులో ఉన్న నగదు తమకు ఇవ్వాలంటూ కుమార్తెలు, కుమారుడు, కోడలు కలిసి ఇటీవలే ఆస్పత్రిలోనే ఆమెపై దాడి చేశారు. డాక్టర్లు కల్పించుకుని దాడిని ఆపారు.
ఈ క్రమంలో నిన్న రాత్రి కిష్టవ్వ ప్రాణాలు కోల్పోయింది. కిష్టవ్వ చనిపోయిన విషయాన్ని డాక్టర్లు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు ఆస్పత్రికి రాలేదు. కిష్టవ్వ మృతదేహం కామారెడ్డి మార్చురీలోనే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.