
అరగుండుతో సర్పంచుల నిరసన
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపాటు
తమకు మళ్లీ జుట్టు వస్తుందని.. పంచాయతీలకు నిధుల గురించి చెప్పలేమంటూ ఎద్దేవా
రాజ్యాంగబద్ధంగా నిధులు, విధులు కల్పించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీల సర్పంచులు గుంటూరు లాడ్జికూడలిలో అరగుండుతో శనివారం నిరసన తెలిపారు.
తొలుత కొరిటెపాడు కూడలిలోని మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించి మహాత్ముని పాదాలకు మొక్కారు.
అనంతరం వట్టిచెరుకూరు మండలం కాట్రపాడు సర్పంచి శివశంకర్‌రావు, ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం సర్పంచి ఆర్.వీరమల్లేశ్వరరావు అరగుండు గీయించుకుని నిరసన వ్యక్తం చేశారు.
సర్పంచి శివశంకర్‌రావు మాట్లాడుతూ 14, 15వ ఆర్థిక సంఘం నిధులను సర్పంచుల సంతకం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం దొంగతనంగా లాగేసుకుందని ఆరోపించారు. దీంతో పంచాయతీల్లో నిధులు లేక విధులు నిర్వహించే పరిస్థితి లేదని వాపోయారు.
పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను కూడా ఇవ్వలేని దుస్థితిలో పంచాయతీలు ఉన్నాయన్నారు. సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారారని, ఉత్సవ విగ్రహాలనైనా ఏడాదికోసారి ఊరేగిస్తారని, తాము గ్రామాల్లో తిరగాలంటే సిగ్గుగా ఉందన్నారు.
కనీసం వాలంటీర్లకు ఇచ్చే గౌరవం కూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కోయవారిపాలెం సర్పంచి ఆర్.వీరమల్లేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ మహాత్మాగాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రం అందించి, ప్రభుత్వం తమ హక్కులు, విధులతో పాటు నిధులు సమకూర్చాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు.
మూడు నెలల తర్వాత తనకు జుట్టు వస్తుందని, కానీ ప్రభుత్వం నుంచి నిధులు ఎప్పటికి వస్తాయో తెలియని పరిస్థితి ఉందని ఎద్దేవాచేశారు.
నిరసనలో ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు కల్లూరి శ్రీనివాసరావు, సంఘం ఉపాధ్యక్షుడు దారా వెంకట్రావు, జిల్లా కార్యదర్శి కర్నాటి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు పాల్గొన్నారు.