
ఏసీబీ కి చిక్కిన ఆర్ ఐ
పౌతి చేయడానికి రూ.50 వేలు లంచం తీసుకున్న అధికారి
ఓ భూమి పౌతి చేసే విషయంలో రైతు నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ సిద్దిపేట జిల్లా ములుగు మండల ఆర్‌ఐ (రెవెన్యూ ఇన్‌స్పెక్టర్) అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు.
ఇందుకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ వివరాలు తెలిపారు. బండనర్సంపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 161, 162లో ఉన్న ఎకరం 14 గుంటల భూమి గ్రామానికి చెందిన ఆంజనేయులు పేరున ఉంది.
అతను చనిపోవడంతో కుమార్తె గిరిజావాణి తన పేరు మీద చేయాలని మూడు నెలల కిందట మీసేవ ద్వారా నమోదు చేసుకున్నారు.
భూ రికార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆర్‌ఐ జావేద్‌పాషాను తహసీల్దార్ ఆదేశించారు.
గిరిజావాణి కుటుంబ సభ్యులతో ఆర్‌ఐ మాట్లాడి ఆమె పేరు మీద రికార్డుల్లో రావాలంటే రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
అంత డబ్బు ఇవ్వలేమని చెప్పడంతో రూ.50 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయంలో న్యాయం చేయాలని బాధితులు ఏసీబీని ఆశ్రయించారు.
గురువారం రాత్రి వర్గల్ మండలం గౌరారం సమీపంలోని ఓ హోటల్ వద్ద రూ.50 వేలు గిరిజావాణి కుమారుడు అఖిల్..
ఆర్‌ఐ జావేద్ పాషాకు ఇచ్చారు. అప్పటికే నిఘా వేసి ఉన్న అధికారులు రెండ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
తహసీల్దార్ కార్యాలయంలో విచారించగా డబ్బులు తీసుకున్నట్టు ఆర్‌ఐ అంగీకరించాడు. ఇతరుల ప్రమేయం లేదని చెప్పినట్లు డీఎస్పీ వెల్లడించారు.