
అటవీ శాఖ అధికారులను నిర్బంధించిన గిరిజనులు.. ఉద్రిక్తత!
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో ఉద్రిక్తత నెలకొంది. తండావాసులు, అటవీ అధికారుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ క్రమంలో అటవీ అధికారులను తండా వాసులు నిర్బంధించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఇక విధులకు ఆటంకం కలిగించినందుకు తండావాలసులపై మాచారెడ్డి డిప్యూటీ రేంజ్ రమేష్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇక వివరాల్లోకి వెళితే.. పాత ఎల్లంపేట, దుర్గమ్మ గుడి తండా సమీపంలో ఉన్న అటవీ భూమిని గిరిజనులు అక్రమంగా చదును చేస్తున్నారు.
అయితే సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకొని వారిని అడ్డుకున్నారు.
దీంతో తండావాసులు ఇంకా అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.ఈ క్రమంలో తండావాసులు చదును చేస్తున్న ట్రాక్టర్లను తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు.
దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడంతో.. అటవీ అధికారులను తండా వాసులు నిర్బంధించారు. ఇక బీట్ ఆఫీసర్ ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో స్థానిక సెక్షన్ ఆఫీసర్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
తండావాసులను చెల్లాచెదురు చేశారు. కాగా, నిబంధనలకు విరుద్ధంగా గత కొంత కాలంగా మాచారెడ్డి మండలంలో అటవీ భూములను ఆక్రమిస్తూ ఆ పరిసర ప్రాంత రైతులు, గిరిజనులు సాగు చేస్తున్నారు.
విషయం తెలుసుకొని అటవీ శాఖ అధికారులు వెళ్లి అడ్డుకోవడంతో తండా వాసులు తిరగబడ్డారు.
అయితే అక్రమంగా అటవీభూములను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని..ఆక్రమణకు పాల్పడ్డ గిరిజనులపై తప్పని సరిగా యాక్షన్ తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మరో వైపు పోలీసు స్టేషన్లో కేసు నమోదు కావడంతో విచారణ మొదలైంది.