
పోలీసుల అదుపులో ఉన్న నిందితుడి మృతి
కొట్టడం వల్లే మరణించాడని బంధువుల ఆందోళన
ఫిట్స్ రావటంతో ఆసుపత్రికి తరలించామంటున్న పోలీసులు
web desc : ఒక సెల్‌ఫోన్ చోరీ కేసులో సికింద్రాబాద్‌లోని తుకారాంగేట్ ఠాణా పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుడి మృతి ఉద్రిక్తతకు దారితీసింది.
పోలీసుల దెబ్బలకే అతడు మరణించాడంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఉదంతంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి. ఎల్బీనగర్‌లోని భూపేష్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ చిరంజీవి (32)పై 20కి పైగా దొంగతనం కేసులున్నాయి.
అతనికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. అతడే సెల్‌ఫోన్ దొంగిలించినట్లు సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా గుర్తించి ముగ్గురు కానిస్టేబుళ్లు మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. బడంగ్‌పేట్ తీసుకెళ్తున్నామంటూ బంధువులకు చెప్పారు. రాత్రి 8 గంటల సమయంలో తుకారాంగేట్ ఠాణాకు చేరుకున్నారు. ప్రశ్నిస్తున్న సమయంలో అతడికి రక్తపువాంతులతో ఫిట్స్ రావటంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స అందిస్తుండగానే అతడు మరణించాడు. రాత్రి 11 గంటల సమయంలో బంధువులకు సమాచారమివ్వడంతో ఉత్తరమండలం డీసీపీ కార్యాలయం వద్ద అర్ధరాత్రి వర్షంలోనే ఆందోళన నిర్వహించేందుకు వారు బయల్దేరారు. మారేడుపల్లి పోలీసులు వారిని అడ్డుకున్నారు.
‘గాంధీ’ ఎదుట ఆందోళన
మృతదేహం ఉన్న గాంధీ మార్చురీ వద్దకు బుధవారం ఉదయం వచ్చిన మృతుడి బంధువులు బాధ్యులపై కేసు నమోదుచేయాలని ఆందోళన చేశారు. పోలీసులు చెదరగొట్టడంతో ఆసుపత్రి బయట రాస్తారోకో చేపట్టారు.
చిరంజీవిని విచారణ కోసమని తీసుకెళ్లి కొట్టి చంపారంటూ తల్లి లక్ష్మి, కుటుంబసభ్యులు ఆరోపించారు. పోలీసులు తీసుకెళ్లినప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడని, గంటల వ్యవధిలోనే అనారోగ్యంతో ఎలా చనిపోతాడంటూ నిలదీశారు. చిరంజీవి తల, ఛాతీపై గాయాలున్నట్లు తెలిసిందని, వాస్తవం తేలేంతవరకూ కదలబోమంటూ బైఠాయించారు.
న్యాయం జరిగేవరకు పోస్టుమార్టం చేయొద్దంటూ డిమాండ్‌చేశారు. భార్య, పిల్లలకు పరిహారం ఇప్పిస్తామంటూ పోలీసులు, అధికారులు నచ్చజెప్పినా వినలేదు.
తమకు డబ్బు అవసరం లేదని, బాధ్యులకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు. పోలీసులు, బంధువుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తుకారాంగేట్ పోలీసులు తెలిపారు.
నోరు మెదపని పోలీసులు
ఈ ఘటనపై పోలీసులు గోప్యత పాటించారు. తుకారాంగేట్ ఠాణాలోకి బుధవారం బయటివ్యక్తులు, మీడియాను అనుమతించలేదు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ను బహిర్గతం చేయలేదు. ముగ్గురు కానిస్టేబుళ్లను రహస్య ప్రాంతానికి తరలించినట్టు సమాచారం. మృతుడి బంధువులతో రాజీకి యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.