వివాదాస్పదంగా పోలీసుల తీరు

Spread the love

బంపర్ ఆఫర్.. నాకు ఆ స్టేషన్ కావాలి..

సూర్యాపేట: రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎస్సైల బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది.
మరో ఐదారు నెలల్లో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎస్సైల బదిలీల వ్యవహారం తెరమీదకి వచ్చింది.

సూర్యా పేట జిల్లాలో జిల్లా కేంద్రంతో పాటుగా కోదాడ, హుజుర్ నగర్, తుంగతుర్తి ఆయా నియోజకవర్గాలలోని మండలాలలో పనిచేస్తున్న కొంతమంది ఎస్సైల పోస్టింగ్ కాలం మరో కొద్ది రోజులలో పూర్తికానుంది.

కొద్దిరోజులుగా జిల్లాలో ఎస్సైల బదిలీలు జరుగుతాయని వార్తలు వినిపిస్తుండటం తో పైరవీలు ఊపందుకున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బదిలీల విషయంలో పోలీస్ యంత్రాంగం, ఆ శాఖ ఉన్నతాధికారులు ఆచితూచి ఆడుగులు వేస్తున్నారు.

ఎవరికి ఎక్కడ పోస్టింగులు ఇవ్వాలి అనే విషయంలో పోలీస్ యంత్రాంగం ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

నేతల మెప్పు కోసం ఖాకీల పాట్లు

జిల్లాలోని కొంతమంది ఎస్సైలు రెవెన్యూ వచ్చే ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు. రెవెన్యూ స్థానాల కోసం నేతల ఇంటి చుట్టూ రోజు తిరుగుతూ పోస్టింగ్‌ల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు.

అంతేకాకుండా నేతల మెప్పు కోసం పడరాని పాట్లు పడుతూ చెప్పినట్లు చేస్తూ తమకు అనువైన స్థానాలను కేటాయించాలని వేడుకుంటున్నారు.

దీంతో పాటు నేతలకే ఆఫర్లు ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎస్సైలు తమపై పనిచేసిన నియోజకవర్గం లేదా జిల్లాలో ఏ జోన్ కైనా మారెందుకు వెనకడడం లేదు.

తమకు తెలిసిన నాయకుడు ఎక్కడ పోస్టింగ్ ఇప్పించిన అక్కడికి వెళ్లి పోతామని సుముఖంగా కొంత మంది ఉన్నారు. కొంతమంది ఎస్సైలు తమ ట్రాక్ రికార్డును బట్టి ఏ స్టేషన్ ఇచ్చిన వెళ్దామన్నా ఆలోచనలతో నేతల చుట్టూ అడుగులు వేస్తున్నారు.

చూపంతా రెవెన్యూ పైనే..

వచ్చే ఎన్నికలలో కొంతమంది ఎస్సైలు దండిగా డబ్బులు సంపాదించాలని ఆలోచనలో ఉన్నారని వినికిడి, ఇందుకోసం తమకు రెవెన్యూ పరంగా ఎక్కువగా వచ్చే స్టేషన్‌ని కేటాయిస్తే ఆ నాయకుడికి ఎంత ముడుపు అయిన ఇచ్చేందుకు ఎస్సైలు సిద్ధమవుతూ బంపర్ ఆఫర్‌ను బహిరంగగానే ప్రకటిస్తున్నారు.

ఇప్పటికే జిల్లాలో ఇసుక ఎక్కువ ఉన్న ప్రాంతానికి తమను బదిలీ చేయాలని కొంతమంది ఆలోచనతో ఉన్నప్పటికీ కొంతమంది వెంచర్లు భూ తగాదాలు ఎక్కువగా ఉన్న స్టేషన్‌కి పోస్టింగ్ ఇస్తే తమకు ఏ విధమైన సహాయం చేయడానికి వెనకాడబోమని కొంతమంది ఎస్సైలు తమ నాయకులతో పేర్కొంటున్నారు.

వివాదాస్పదంగా పోలీసుల తీరు

కోదాడ నియోజకవర్గంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కోదాడ డీఎస్పీ కార్యకర్తలను బయటకు వెళ్లకుండా గేటుకు తాళం వేసి కాపలాగా ఉన్నారు. హుజుర్ నగర్ ఎస్సై గిన్నెలు మోస్తూ కార్యకర్తలకు వడ్డించడం వివాదానికి తెర లేపారు.

ఇటీవల మునగాల ఎస్సై కాంగ్రెస్ ఎంపీటీసీని కొట్టడం దుమారం రేపింది. జిల్లాలో రాజకీయ నాయకులు అండ ఉన్నవారికే న్యాయం దొరుకుతుందని సామాన్య ప్రజలు వాపోతున్నారు.

ఇప్పటికైనా పైసల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసే ఎస్సైని తమ మండల స్టేషన్‌లకు బదిలీ చేయాలని ఉన్నతాధికారులను జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.

2,234 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?