
నమ్మిన ‘బంటు’కు ముకేశ్ అంబానీ ₹1500కోట్ల గిఫ్ట్
★ చిన్ననాటి ‘చెస్’ స్నేహితుడే..
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)
అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఏది చేసినా సంచలనమే. తాజాగా ఈయన తన కంపెనీలో కొన్ని దశాబ్దాల పాటు పనిచేస్తూ నమ్మిన బంటుగా ఉన్న ఓ ఉద్యోగికి కళ్లు చెదిరే కానుక ఇచ్చారు. ఏ ఖరీదైన వాచో.. లగ్జరీ కారో ఇచ్చి ఉంటారని అనుకుంటున్నారా..?
అంతకు మించేనండోయ్..! ఏకంగా రూ.1500 కోట్ల విలువైన 22 అంతస్తుల భవంతిని బహుమతిగా ఇచ్చినట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి.
అత్యంత ఖరీదైన ఆ కానుకను అందుకున్న ఆ ఉద్యోగి ఎవరంటే..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ లో సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న మనోజ్ మోదీకి అంబానీ ఈ గిఫ్ట్ ఇచ్చారు. రిలయన్స్ ఇతర కంపెనీలతో చేసుకున్న వందల కోట్ల ఒప్పందాల్లో మనోజ్ అత్యంత కీలక పాత్ర పోషించాడు. వ్యాపార వర్గాల్లో ఈయనను ముకేశ్ అంబానీ కుడి భుజంగా పేర్కొంటారు.
ప్రస్తుతం రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియోకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కొన్ని దశాబ్దాల పాటు కంపెనీకి ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా అంబానీ కొన్ని నెలల క్రితం ఈ గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అంబానీ డ్రైవర్ జీతం.. తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!
మనోజ్ కు కానుకగా ఇచ్చిన ఈ 22 అంతస్తుల భవంతి ముంబయిలోని నేపియన్ సీ రోడ్డు ప్రాంతంలో ఉంది. ‘బృందావన్’ పేరుతో మొత్తం 1.7లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు.
ఇందులో ఒక్కో అంతస్తు 8వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఉంది. పార్కింగ్ కోసమే 7 అంతస్తులను నిర్మించారు. ఇందులో కొన్ని అంతస్తుల్లో మనోజ్ మోదీ కుటుంబంతో నివసించనుండగా..
మరికొన్నింట్లో ఆయన ఇద్దరు కుమార్తెలు తమ అత్తింటి కుటుంబాలతో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులోని కొంత ఫర్నిచర్‌ను ఇటలీ నుంచి తెప్పించారట.
మార్కెట్ వర్గాల ప్రకారం, ఈ ప్రాంతంలో చదరపు అడుగు ధర రూ.45,100 నుంచి రూ.70,600 వరకు పలుకుతోంది. దీన్ని బట్టి చూస్తే ఈ 22 అంతస్తుల భవంతి ధర రూ.1500కోట్ల వరకు ఉంటుందట.!
చిన్ననాటి ‘చెస్’ స్నేహితుడే..
మనోజ్ మోదీ.. ముకేశ్ అంబానీకి చిన్ననాటి చెస్ స్నేహితుడు.
ముంబయిలోని యూనివర్శిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో వీరిద్దరూ కలిసి చదువుకున్నారు. కలసి చెస్ ఆడారు. రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ కంపెనీకి నాయకత్వం వహిస్తున్నప్పుడే 1980ల్లో మనోజ్ మోదీ సంస్థలో ఉద్యోగిగా చేరారు.
2020లో ఫేస్‌బుక్‌తో కుదిరిన రూ.43వేల కోట్ల డీల్ సహా అనేక భారీ ఒప్పందాలను ఈయనే మధ్యవర్తిగా ఉండి ఖరారు చేయించినట్లు వ్యాపార వర్గాల సమాచారం. మనోజ్ తండ్రి హరిజీవన్‌దాస్ కూడా ధీరూభాయ్‌తో కలిసి పనిచేశారు.