
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, హౌస్ మాస్టర్, పీఈటీ సస్పెన్షన్
పీడీ డీసీఓకు సరెండర్, పార్టుటైం హిందీ మాస్టర్ తొలగింపు
జూపాడుబంగ్లా: స్థానిక గురుకులం విద్యార్థి ఎం. నగేష్ మృతికి బాధ్యులైన వారిపై సాంఘిక సంక్షేమశాఖ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల సెక్రటరీ పవన్‌కుమార్ కొరడా ఝులిపించారు.
జూపాడుబంగ్లా పాఠశాల ప్రిన్సిపాల్ జి.రాజు, హౌస్‌మాస్టర్ ఏసేపు, పీఈటీ లక్ష్మీకాంతారెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పార్ట్‌టైం హిందీ మాస్టర్ పార్థసారథి, ఇద్దరు సెక్యూరిటీ గార్డులను విధుల్లోంచి తొలగించారు. పీడీ గంగాధర్ డీసీఓకు సరెండర్ చేశారు.
విద్యార్థి మృతికి గల కారణాలపై నందికొట్కూరు రూరల్ సీఐ సుధాకర్‌రెడ్డి, డీసీఓ శ్రీదేవి, టెక్నికల్ డిప్యూటీ సెక్రటరీ యోగేశ్వరరావు సోమవారం గురుకుల పాఠశాలకు చేరుకొని పాఠశాల ప్రిన్సిపాల్, హౌస్‌మాస్టర్, పీఈటీ, పీడీ, సెక్యూరిటీ గార్డులు, విద్యార్థులను ఉదయం నుంచి సాయంత్రం దాకా సమగ్రంగా విచారించి నగేష్ మృతికి గల కారణాలపై ఆరా తీశారు.
విద్యార్థి మృతికి గల కారణాలపై సమగ్ర నివేదిక తయారు చేసి కలెక్టర్ మనజీర్‌జిలానీ శామూన్, సెక్రటరీ పవన్‌కుమార్‌కు పంపించారు.
వారి ఆదేశాల మేరకు ముగ్గురిపై సస్పెన్షన్ వేటు పడింది. అలాగే మృతుడి తండ్రి రామకృష్ణ ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్, వార్డెన్, హౌస్ మాస్టర్, ఫిజికల్ డైరెక్టర్‌పై కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ తెలిపారు.
గురుకుల పాఠశాలలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు దిలీప్‌రాజు, సీపీఐ నాయకుడు రమేష్, విద్యార్థి సంఘం నాయకులు అధికారులను కోరారు.
ప్రిన్సిపాల్ నిర్లక్ష్యమే కారణమా.. 640 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్న గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ రాజు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.
సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు విద్యార్థులు తరచూ బయటకు వెళ్లడం, మరి కొందరు దురలవాట్ల బారినపడినట్లు తెలుస్తోంది.
నగేష్ మృతి చెందిన బావి యజమాని నెలరోజుల క్రితమే పాఠశాలకు చేరుకుని విద్యార్థులు ఈత కొట్టేందుకు వస్తున్నారని, కట్టడి చేయాలని, గతంలో ఇద్దరు మృతి చెందారనే విషయం ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.