
ఎక్కడెక్కడో టచ్ చేశారు-అందుకే నెట్టేశా-నాంపల్లి కోర్టులో వైఎస్ షర్మిల వాదన..
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ తెలంగాణ పోలీసులపై దాడి అనంతరం ఆమెను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. షర్మిలను రిమాండ్ కు ఇవ్వాలంటూ పోలీసులు కోర్టును కోరారు.
దీనిపై స్పందించిన ఆమె లాయర్ పోలీసులపై దాడికి దారి తీసిన కారణాల్ని కోర్టుకు తెలిపారు. పోలీసులపై షర్మిల దురుసు ప్రవర్తనపై పోలీసులు కూడా అంతే దీటుగా తమ వాదన వినిపించారు.
పోలీసులు ఇవాళ ఎలాంటి వారంట్ లేకుండా తన ఇంటి మీదకి వచ్చారని వైఎస్ షర్మిల నాంపల్లి కోర్టు న్యాయమూర్తికి తెలిపారు.
ఎలాంటి అరెస్టు నోటీసు ఇవ్వలేదని, పురుష పోలీసులు తనపై దురుసు గా ప్రవర్తించారని తెలిపారు. తనను తాకే ప్రయత్నం చేశారన్నారు. ఆత్మరక్షణలో భాగంగానే పోలీసులను నెట్టివేసినట్లు పేర్కొన్నారు.
TSPSC పేపర్ లీకేజ్ కేసు పై సిట్ చీఫ్ ను కలవడానికి వెళ్తున్న షర్మిల ను అడ్డుకున్నారని ఆమె న్యాయవాది తెలిపారు.
వైఎస్ షర్మిలను ప్రతిసారి పోలీసులు టార్గెట్ చేస్తున్నారని ఆమె న్యాయవాది తెలిపారు. షర్మిలపై దురుసుగా ప్రవర్తించింది పోలీసులేనన్నారు. 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా ఆరెస్ట్ చేశారన్నారు.
షర్మిలపై నమోదు చేసిన సెక్షన్స్ అన్ని ఏడు సంవత్సరాల లోపు శిక్ష మాత్రమేనన్నారు. కాబట్టి ఆమె రిమాండ్ ను రెజెక్ట్ చెయ్యాలని కోరారు. బెయిల్ పిటిషన్ కూడా వేస్తున్నట్లు వెల్లడించారు.
ఆడపిల్ల అని కూడా చూడకుండా ఎక్కడపడితే అక్కడ పోలీసులు టచ్ చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. దర్యాప్తుకు సహకరిస్తామని, రిమాండ్ ఇవ్వొద్దని కోరారు.
హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు షర్మిలను బయటికి వెళ్లేందుకు సహకరించలేదని ఆమె న్యాయవాది తెలిపారు. ఆమెను అరెస్టు చేయకముందే ఓ పురుష ఎస్సై ఆమెను ఎక్కడెక్కడో తాకారని ఆరోపించారు.
పోలీసులు కూడా షర్మిల దురుసు ప్రవర్తనకు సంబంధించిన ఆధారాల్ని కోర్టుకు సమర్పించారు. దీంతో వాదనలు ముగిశాయి.
వైఎస్ షర్మిలతో పాటు పోలీసుల వాదనలు కూడా విన్న నాంపల్లి కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.