
బావిలో పడి గురుకుల విద్యార్థి మృతి
స్థానిక అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థి ఎం. నగేష్ బావిలో పడి మృతి చెందాడు. కర్నూలు మండలం దిన్నెదేవరపాడు గ్రామానికి చెందిన ఎం.రామకృష్ణ, ఐశ్వర్య దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం.
పెద్ద కుమారుడు నగేష్ 2018-19 నుంచి ఇక్కడే విద్యనభ్యసిస్తున్నాడు. శనివారం ఉదయం పాఠశాల సమీపంలోని బావిలో ఈతకొట్టేందుకు కొందరు విద్యార్థులతో నగేష్ కలసి వెళ్లాడు.
11.30 గంటల ప్రాంతంలో నగేష్ తప్ప మిగతా విద్యార్థులు పాఠశాలకు తిరిగి చేరుకున్నారు. రాత్రి 9.30 గంటల వరకు కూడా నగేష్ రాకపోవడంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
ఆదివారం ఉదయం పాఠశాల చేరుకున్న వారు తమ కుమారుడి ఆచూకీ చెప్పాలంటూ నిలదీశారు. మధ్యాహ్నం ప్రిన్సిపాల్ రాజు, తల్లిదండ్రులు నగేష్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానంతో బావి వద్ద గాలించారు.
నీళ్లు ఎక్కువగా ఉండటంతో పూర్తిగా గాలించేందుకు సాధ్యం కాలేదు. కాగా సాయంత్రం 6 గంటల సమయంలో బావిలో విద్యార్థి శవమై కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
విషయం తెలుసుకున్న సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య వారి సిబ్బందితో సంఘటనా ప్రాంతం వద్దకు చేరుకొని బావిలోంచి మృతదేహాన్ని వెలికితీయించారు.
పాఠశాలలో విద్యార్థి కనిపించకుండా పోతే సమీపంలో ఉన్న పోలీసుస్టేషన్‌లో ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రిన్సిపాల్ రాజు, కేర్‌టేకర్, హౌస్‌మాస్టర్, ఉపాధ్యాయులపై సీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న ఆత్మకూరు ఆర్డీఓ ఎం. దాసు సంఘటనా ప్రాంతానికి చేరుకుని విద్యార్థి మృతిపై ఆరా తీశారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తా మని విద్యార్థి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.
కాగా నగేష్‌కు ఈత రాకపోవడంతో నేర్చుకునేందుకు వెళ్లి నీటమునిగి ఉంటాడని అనుమానం వ్యక్తమవుతోంది.
కాగా ఇదే పాఠశాలలో గతంలో సిబ్బంది నిర్లక్ష్యంతో ఇప్పటి వరకు ఐదుగురు విద్యార్థులు ప్రమాదాల బారిన పడి మృతి చెందారు.
మృతదేహంతో పాఠశాల వద్ద ధర్నా
గురుకులం విద్యార్థి బావిలో పడి మృతిచెందిన విషయం తెలుసుకొన్న సీపీఐ నాయకుడు రమేష్, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు దిలీప్‌రాజు, విద్యార్థిసంఘం నాయకుడు శ్రీనివాసులు, మృతిచెందిన విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు తదితరులు సంఘటనా ప్రాంతానికి చేరుకొన్నారు.
మృతదేహంతో గురుకుల పాఠశాల వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు.
విద్యార్థి నగేష్ మృతికి కారణమైన ప్రిన్సిపాల్, కేర్‌టేకర్, హౌస్‌మాస్టర్‌పై కేసులు నమోదు చేసి వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
మృతుని కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ఇప్పించాలని డిమాండ్ చేశారు.
అధికారుల విచారణ
జూపాడుబంగ్లా గురుకులానికి చెందిన విద్యార్థి బావిలో పడి మృతి చెందిన విషయం తెలుసుకున్న సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా కో ఆర్డినేటర్ శ్రీదేవి, సాంఘిక సంక్షేమ శాఖ టెక్నికల్ డిప్యూటీ సెక్రటరీ యోగేశ్వరరావు జూపాడుబంగ్లాకు చేరుకుని విచారణ చేపట్టారు.
విద్యార్థి మృతికి పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కనిపిస్తుందని ఆర్డీఓ ఎం.దాసు వారికి వివరించారు.