
పోలీస్ స్టేషన్ నుండి ఎస్సై పరార్.. వెతుకుతున్న పోలీసులు
తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం, కంచె చేను మోయడం వంటి సామెత గురించి వినే ఉంటారు. ఇవి ఆంధ్రప్రదేశ్‌లోని పోలీసులకు బాగా వర్తిస్తాయి అనుకుంటా.
రెండేళ్ల క్రితం చిత్తూరులో చిన్న బట్టల దుకాణంలో చొరబడి పోలీసులే చీరలు ఎత్తుకు వెళ్లిపోయారు. తీరా దుకాణాదారుడు గుర్తించి సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తే పోలీసులు ఎత్తుకు పోయారని తెలిసింది. కేసు పెడదామంటే సర్థి చెప్పారు.
అయితే మొన్నటికి మొన్న కర్నూలు జిల్లా పోలీసుల ఘన కార్యం వెలుగు చూసింది. 2021లో రికవరీ చేసిన సొత్తును బీరువాలో దాచగా.. దొంగతనానికి గురైంది. రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్‌లో ఇలా జరిగిందని అందరూ ముక్కున వేలేసుకున్నారు.
అయితే ఇది ఇంటి దొంగల పనేనని గట్టిగా వినబడింది. అప్పటికే ముగ్గురు సీఐలు బదిలీ కావడంతో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది.
ఇప్పుడు మరో పోలీసు అధికారి వ్యవహారం బయటకు వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ.. లంచాలు తీసుకుంటూ దొరికిపోయాడు ఓ ఎస్సై. తూర్పుగోదావరి జిల్లా మోతుగూడెం ఎస్ఐ సత్తిబాబు. గంజాయి స్మగ్లర్లతో చేతులు కలిపి..పెద్ద దందా నడిపాడు.
తన జేబులు నింపితే చాలు, వారిని వదిలిపెట్టేసేవాడు. ఈ విషయం స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులకు తెలిసింది. విచారణలో అతడు లంచాలు తీసుకుంటూ సొంత ఇంటికే కన్నం పెడుతున్నాడని అధికారులు నిర్ధారించుకున్నారు.
అరెస్టు చేసి రంపచోడవరం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే బేడీలు వేయకుండా వదిలేయడంతో.. సత్తిబాబు పరారయ్యాడు. పోలీసే.. పోలీసు స్టేషన్ నుండి దొంగలా పారిపోయాడు.
ఈ దొంగ పోలీసు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆరు టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ విషయం ప్రజలకు తెలిస్తే ఇజ్జత్ పోతుందని.. బయటకు చెప్పడం లేదట పోలీసులు.