తాంబూలాలు ఇచ్చాం.. తన్నుకు చావండి..

Spread the love

తాంబూలాలు ఇచ్చాం.. తన్నుకు చావండి”..

హైదరాబాద్​ మహా నగరంలో 24/7 దుకాణాలు తెరిచి ఉంచుకోవచ్చంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పోలీసు వర్గాలు చేస్తున్న వ్యాఖ్య ఇది.
క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయో అన్న దానిపై కనీస కసరత్తు కూడా చేయకుండా తీసుకున్న ఈ నిర్ణయం శాంతిభద్రతల పరిస్థితిని ఖచ్చితంగా దెబ్బ తీస్తుందని పలువురు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అలా జరగకుండా చూడాలంటే ప్రస్తుతం పగటి వేళల్లో ఎంతమంది సిబ్బంది అయితే పోలీస్​స్టేషన్లలో ఉంటున్నారో.. అంతేమంది రాత్రుళ్లు కూడా ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు. శాంతిభద్రతల పరిస్థితికి విఘాతం కలగకుండా చూడాలంటే ప్రతీ స్థాయిలో ప్రస్తుతం ఉన్న సిబ్బందిని రెట్టింపు చేయాల్సి ఉంటుందన్నారు. ఇది సాధ్యమేనా? అని ప్రశ్నిస్తున్నారు.

పోలీస్​మాన్యువల్​ప్రకారం ప్రతీ అయిదు వందల మంది జనాభాకు ఒక పోలీస్​చొప్పున నిష్పత్తి ఉండాలి. అయితే, ప్రస్తుతం గ్రేటర్​హైదరాబాద్‌లో ఈ పరిస్థితి లేదు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్​కమిషనరేట్లలో కలిపి కోటిన్నరకు పైగా జనాభా ఉండగా పోలీసు సిబ్బంది

దాదాపు పదివేల మంది మాత్రమే ఉన్నారు.
అంటే, ప్రతీ పదిహేను వందలమందికి ఒక పోలీస్​చొప్పున నిష్పత్తి ఉంది. ఫలితంగా ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందిపై పని ఒత్తిడి తీవ్రంగా ఉంటోంది.

ఈ క్రమంలో సిబ్బంది మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతుండటంతో ఉన్నతాధికారులు మూడు షిప్టులను మొదలు పెట్టించారు.

అయితే, ఆచరణలోకి వచ్చేసరికి మూడు షిఫ్టుల డ్యూటీలు సాధ్యం కావటం లేదని పలువురు ఇన్స్ పెక్టర్లు చెబుతున్నారు.

మూలిగే నక్కపై..

ఇటువంటి పరిస్థితుల్లో రాష్ర్ట ప్రభుత్వం 24/7 దుకాణాలు తెరిచి ఉంచటానికి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేయటం పట్ల పోలీసు సిబ్బంది తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఇది మూలిగే నక్కపై తాటి పండు పడటమే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌లో రాత్రుళ్లు తిరిగే వారి సంఖ్య రెండు లక్షలకు పైగానే ఉంటుందని ఓ సీనియర్​పోలీసు అధికారి చెప్పారు.
వీరిలో ఐటీ ఉద్యోగులు, ప్రైవేట్​కంపెనీల్లో నైట్​డ్యూటీలు చేసేవారు, ఆటో డ్రైవర్లు, క్యాబ్​డ్రైవర్లు, కాలేజీ విద్యార్థులు, హాస్టళ్లలో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్దమవుతున్నవారు ఉన్నారని చెప్పారు.

ఇక, 24 గంటలు దుకాణాలు తెరిచి ఉంచితే రాత్రుళ్లు తిరిగేవారి సంఖ్య నాలుగైదు రెట్లు పెరగటం ఖాయమని చెబుతున్నారు.

అర్ధరాత్రి వరకు మద్యం..

ఇక, అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటున్న వైన్​షాపులు, బార్లు సమస్యలను మరింతగా పెంచుతాయని అధికారులు అంటున్నారు.

ప్రస్తుతం వైన్​షాపులు రాత్రి 11గంటల వరకు నడుస్తున్నాయన్నారు. బార్లలో రాత్రి 11గంటల వరకు మాత్రమే మద్యం సరఫరా చేయాల్సి ఉన్నా అర్ధరాత్రి వరకు మందు ఇస్తున్నారని చెప్పారు.

రాత్రుళ్లు మొత్తం మద్యం విక్రయాలు జరిపే వైన్​షాపుల సంఖ్య గ్రేటర్‌లో పదుల సంఖ్యలో ఉంటుందన్నారు. ఇలా అందుబాటులో ఉంటున్న వైన్స్, బార్లలో పీకలదాకా తాగి రోడ్ల మీదకు వస్తున్నవారు

యాక్సిడెంట్లు చేస్తుండటంతో పాటు చిన్న చిన్న కారణాలతో గొడవలు పడుతూ శాంతిభద్రతల పరిస్థితికి విఘాతం కలిగిస్తున్నారని చెప్పారు.

దోపిడీలు పెరుగుతాయి..

ఇక, 24/7 దుకాణాలు తెరిచి ఉంటే దారి దోపిడీలు, చెయిన్​ స్నాచింగులు, ఈవ్​టీజింగ్, రోడ్డు ప్రమాదాలు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు.

సీసీ కెమెరాలు ఉన్నా వాటిలో కనీసం ముప్పయి శాతం పని చేయవన్న విషయం అందరికీ తెలిసిందే అని చెప్పారు. దీనికితోడు రాత్రుళ్లు సీసీ కెమెరాల్లో వాహనాల నెంబర్లు, జనం ముఖాలు సరిగ్గా రికార్డు కావన్నారు.

దీనిని అవకాశంగా చేసుకుని పాత నేరస్తులతోపాటు కొత్తగా నేర ప్రపంచంలోకి అడుగు పెట్టినవారు సైతం విజృంభించే ప్రమాదం ఉందని వివరించారు.

ఇవన్నీ జరగకుండా ఉండాలంటే..

ఈ నేరాలు జరగకుండా ఉండాలంటే ప్రస్తుతం హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్​కమిషనరేట్లలో పని చేస్తున్న సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేయాల్సి ఉంటుందని ఓ సీనియర్​పోలీసు అధికారి చెప్పారు.

ఎందుకంటే 24/7 షాపులు తెరిచి ఉంటే రాత్రుళ్లు కూడా పగలు తిరిగినంత మంది జనంతిరుగుతారని చెప్పారు. ప్రస్తుతం పోలీస్​స్టేషన్లలో పగటి వేళ నలుగురు ఎస్సైలు, ఓ ఇన్స్​పెక్టర్, ఓ డిటెక్టీవ్​ఇన్స్ పెక్టర్​విధుల్లో ఉంటారని చెప్పారు.

కోర్టు, ఎస్కార్టు, బందోబస్తు డ్యూటీలతో పాటు స్టేషన్​రైటర్లు ఇలా పోను క్షేత్రస్థాయిలో పని చేయటానికి ఒక్కో షిఫ్టులో పదిహేను నుంచి ఇరవై మంది సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉంటారన్నారు.

ఇక, రాత్రుళ్లు ఒక్కో పోలీస్​స్టేషన్‌లో ఎస్సై లేదా ఏఎస్సై కొంతమంది సిబ్బంది మాత్రమే ఉంటారని వివరించారు.

బయట జనం వేలల్లో తిరుగుతుంటే వేళ్ల మీద లెక్కబెట్టేంత సంఖ్యలో ఉండే ఈ సిబ్బంది శాంతిభద్రతలను ఎలా కాపాడగలరని ప్రశ్నించారు. రాత్రుళ్లు కూడా వ్యాపారాలు చేసుకోవచ్చంటే ప్రస్తుతం ఉన్న సిబ్బందిని రెట్టింపు చేసి పగటి వేళల్లో ఎలా అయితే డ్యూటీలు చేయిస్తున్నారో..

రాత్రుళ్లు కూడా అలాగే చేయించాలన్నారు. డీసీపీ జోన్లు, ఏసీపీ సబ్​డివిజన్లు, పోలీస్​స్టేషన్ల సంఖ్యను పెంచామని 24 గంటలపాటు దుకాణాలు తెరిచి ఉంచటానికి అనుమతినిస్తే ఖచ్చితంగా శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయని అంటున్నారు.

1,728 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?