
పిడుగుపాటుకు కూలీ మృతి
ఈ సంఘటన ఎస్.కోట మండలంలోని కొట్టాం జంక్షన్ సమీపంలోని మామిడిపల్లి గ్రామ పెద్ద చిట్టిపోలు రమణ ఇటుకుల బట్టి వద్ద శనివారం నాలుగు గంటల సమయంలో చోటుచేసుకుంది.
ఎప్పటిలాగే భార్యభర్తలు ఇద్దరు కలిసి ఇటుకుల బట్టిలో పనిచేసేందుకు వెళ్లారు. అయితే వీరిలో భర్తపై ఆకస్మాత్తుగా అగ్గిపిడుగు పడటంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
భార్య తమ వెంట తెచ్చుకున్న వాటర్ బాటిల్ ను పక్కన పెట్టేందుకు వెళ్లడంతో తటిలో మత్యువునుంచి తప్పించుకుంది.
మామిడిపల్లి ఎస్‌సి కాలనీకి చెందిన బొంగరాల అప్పారావు(45) తన భార్య లక్ష్మణ ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట పనికి వెళ్తారు. శనివారం కొట్టాం జంక్షన్లో వున్న ఇటుకుల బట్టీకి పనికి వెళ్లారు.
ఉదయమంతా పనిచేసి రెండు గంటల సమయంలో భార్యభర్తలు ఇద్దరు కలిసి బోజనం చేశారు. కాసేపు విశ్రాంతి తీసుకుని మూడుగంటల సమయంలో మరోసారి పని మొదలు పెట్టారు.
ఈసమయంలో వర్షం మొదలుకావడంతో పాటు ఉరుములు వచ్చాయి. ఆ సమయంలో లక్ష్మణ తమతో తెచ్చుకున్న వాటర్ బాటిల్ తడిసిపోతుండటంతో పక్కన పెట్టేందుకు వెళ్లింది.
ఆమె వెళ్లిన క్షణాల వ్యవధిలోనే తన భర్త అప్పారావుపై పెద్దఎత్తున పిడుగు పడి సంఘటన స్థలంలో శరీరం కాలిపోయి చనిపోవడం చూసి మూర్చపోయింది.
గమనించిన చుట్టుపక్కల వారు సంఘటన స్థలానికి చేరుకొని అప్పారావును చూడగా అప్పటికే చనిపోయాడు. అతని భార్యకు సపర్యలు చేసి తేరుకునేలా చేశారు.
ఎప్పుడూ భార్యభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, పిడుగు వారి కుటుంబంలో విషాదం నింపిందని ఆవేదన చెందారు.
వీరికి ఇద్దరు కుమారులు, వృద్ధురాలైన తల్లి ఉన్నారు. నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.