
దైవ దర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు..
కుటుంబ సభ్యులతో కలిసి వేణుగోపాల స్వామి దైవదర్శనికి వెళ్తున్న క్రమంలో ఓ బాలిక అనంత లోకాలకు చేరింది.
కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్న ఆ బాలికను మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబలించింది.
వైరా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఏన్కూర్ మండలం తుతక్క లింగన్నపేట గ్రామానికి చెందిన రాజబోయిన వేదప్రియ (8) శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.
తూతక లింగన్నపేట గ్రామానికి చెందిన రాజబోయిన సురేష్, తన భార్య సీతామహాలక్ష్మి సుతారి పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.
ఈ దంపతులు ప్రతి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దైవ దర్శనానికి వెళ్తుంటారు.
శుక్రవారం కూడా ఈ దంపతులు తమ కుమారుడు కూతురు వేద ప్రియ తో కలిసి తన మోటారు సైకిల్ పై నెమలిలో జ్ఞాన గణేష్ దేవుని దర్శనం కోసం బయలుదేరారు.
మార్గ మధ్యలోని వైరా మండలం సిరిపురం గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు మోటారు సైకిల్ పై నుండి వేదప్రియ జారీ రోడ్డుపై పడింది.
దీంతో బాలిక తలకు తీవ్ర గాయం కావడంతో రక్తస్రావం అయింది. బాలికను హుటాహుటిన ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
కాగా చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. మోటార్ సైకిల్ బ్యాలెన్స్ తప్పి పడిపోవడంతో సురేష్ కు స్వల్ప గాయాలయ్యాయి.
దైవ దర్శనం కోసం తమతో బయలుదేరిన కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కలిచివేసింది.
బాలిక తల్లి సీతమహాలక్ష్మి ఫిర్యాదు మేరకు వైరా పోలీసులు కేసు నమోదు చేశారు.