
డాక్టర్ అవతారమెత్తిన యువతి.. అందరినీ నమ్మించి ఏం చేసిందో తెలుసా?
ఒంటిపై తెల్లకోటు, మెడలో స్టెతస్కోప్. చూడడానికి డాక్టర్ లా ఉండడంతో జనాలు అందరూ నమ్మారు. ఇదే అదునుగా భావించిన ఆ యువతి ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడింది.
చాలా మంది అమాయక యువతులను నమ్మించి నిండా ముంచింది. చివరికి ఆమె డాక్టర్ కాదని, ఓ నకిలీ డాక్టర్ అని తెలుసుకున్న ఆ యువతులు.. ఒక్కసారిగా నెత్తి, నోరు బాదుకున్నారు.
ఈ కిలాడీ లేడి బాగోతం బయటపడడంతో కళ్లు తేలేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. నకిలీ డాక్టర్ అవతారమెత్తి ఆ యువతి ఏం చేసిందో తెలుసా?
పైన ఫొటోలో అమాయకంగా కనిపిస్తున్న యువతి పేరు అరుణసాయి. వయసు 24 ఏళ్లు. కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన ఆ యువతి గతంలో జీఎన్ఎం కోర్సు పూర్తి చేసింది. దీంతో అప్పటి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు ప్రయత్నం మొదలు పెట్టింది. కానీ, ఎక్కడా కూడా ఆమెకు ఉద్యోగం లభించలేదు.
చివరి సారిగా జీజీహెచ్ లో ఉద్యోగం కోసం ప్రయత్నించినా ఆమె ఆశలు ఫలించలేదు. ఈ క్రమంలోనే ఆ యువతికి ఓ ఆలోచన వచ్చింది. అదే డాక్టర్ అవతారం. తాను అనుకున్నట్లుగానే ఒంటిపై తెల్లకోటు, మెడలో స్టెతస్కోప్ ధరించి నకిలీ డాక్టర్ అవతారమెత్తింది. ఇక రోజూ జీజీహెచ్ ఆస్పత్రికి వెళ్లేది. ఆమెను చూసి జనాలంతా నిజంగానే డాక్టర్ అనుకునేవారు.
ఇదే సమయంలో అరుణసాయికి కాకినాడకు చెందిన మాధురి, మమత అనే ఇద్దరు యువతులు పరిచమయ్యారు. మెల్లగా వారితో స్నేహం చేసి నమ్మకంగా మెలిగింది.
ఆ తర్వాత మీకు ఆరోగ్య మిత్రలో ఉద్యోగాలు ఇప్పిస్తానని వారిని నమ్మించింది. అరుణ సాయి మాటలు విన్న ఆ ఇద్దరు యువతలు ఇదంతా నిజమే అనుకున్నారు. కానీ, ఉద్యోగాలు పొందేకన్న ముందు కొంత డబ్బు ఖర్చు అవుతుందని కూడా చెప్పింది.
దీనికి వాళ్లిద్దరూ సరేనంటూ తలలు ఊపారు. ఇక పలు దఫాలుగా ఆమెకు మాధురి, మమత ఏకంగా రూ.47 వేలు ముట్టజెప్పారు. అలా కొన్ని నెలలు గడిచింది. కానీ, వారికి ఉద్యోగాలు మాత్రం లభించలేదు.
అరుణ సాయిని కలిసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆమె దొరకలేదు. దీంతో మోసపోయామని గ్రహించిన ఆ ఇద్దరు యువతులు గురువారం జీజీహెచ్ కు వెళ్లారు. జరిగిందంతా అక్కడి అధికారులకు వివరించారు.
ఇక సెక్యూరిటీ గార్డ్ సాయంతో ఎట్టకేలకు నకిలీ డాక్టర్ అరుణ సాయిని పట్టుకుని నిలదీశారు. అక్కడా తీరా వారికి తెలిసింది ఏంటంటే ఆమె డాక్టర్ కాదని, నకిలీ డాక్టర్ అని తెలుసుకుని ఇద్దరు యువతులు నెత్తి, నోరు బాదుకున్నారు.
అనంతరం అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. వన్ టౌన్ పోలీసులు వచ్చి ఆ యువతిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.