
కూలీల ట్రాక్టర్ బోల్తా
కోనకనమిట్ల: మిర్చి కోతలకు వెళ్లి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో 10 మంది కూలీలకు గాయాలయ్యాయి.
ఈ సంఘటన మండలంలోని గార్లదిన్నె వద్ద గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
వివరాలు.. కందివారిపల్లెకు చెందిన పగడాల లక్ష్మీరెడ్డికి చెందిన ట్రాక్టర్‌లో కూలీలను గార్లదిన్నెలో వారి బంధువుల తోటలో మిర్చి కోతకు తీసుకొచ్చారు.
పని ముగిశాక ఇంటికి వెళ్లే క్రమంలో అతివేగం కారణంగా గార్లదిన్నె మూల మలుపు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి ట్రక్కు బోల్తా పడింది. ట్రక్కులో ఉన్న 25 మంది కూలీలు చెల్లా చెదురుగా పడిపోయారు.
సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను మార్కాపురంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.
వారిలో అంగిరేకుల గంగమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తీసుకెళ్లారు.
సంఘటనా స్థలాన్ని ఎస్సై దీపిక పరిశీలించి వివరాలు సేకరించారు.
ప్రమాదానికి గల కారణాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.