
రేణుక చౌదరితో రేవంత్ రెడ్డి కీలక భేటీ.. ఆ నేతలకు చెక్ పెట్టబోతున్నారా ?
తెలంగాణ కాంగ్రెస్‌లో తనకు వ్యతిరేకంగా ఉంటున్న కాంగ్రెస్ సీనియర్ నేతల సంఖ్య పెరుగుతూ ఉండటంతో.. తనకు అనుకూలంగా ఉండాలని రేవంత్ రెడ్డి సీనియర్ నాయకురాలుగా ఉన్న రేణుక చౌదరిని కలిసి ఉండొచ్చనే ప్రచారం కూడా కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో నేతలు వివిధ గ్రూపులుగా సమావేశం కావడం కొత్తేమీ కాదు. అయితే అలా భేటీ అయిన ప్రతిసారి కాంగ్రెస్‌లో కొత్త చర్చ మొదలవుతుంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి(Renuka Chowdary) నివాసంలో పలువురు కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు.
ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) హాజరయ్యారు. ఆయనతో పాటు అంజన్ కుమార్ యాదవ్, ఇరవత్రి అనిల్, బలరాం నాయక్, వేం నరేందర్ రెడ్డి సహా పలువురు నేతలు ఈ భేటీకి వచ్చారు. వీరంతా తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి అనుకూల వర్గం నేతలే కావడంతో.. ఇది రేవంత్ రెడ్డి వర్గం నేతల భేటీ అనే చర్చ కాంగ్రెస్‌లో జరుగుతోంది.
మూడు గంటలకు పైగా జరిగిన సమావేశం తరువాత నేతలెవరూ బయట మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.
ఖమ్మం జిల్లాలో జరగబోయే నిరుద్యోగ నిరసన దీక్షకు సంబంధించి ఈ భేటీలో చర్చించినట్టు నేతలు చెబుతున్నప్పటికీ.. అసలు ఈ సమావేశం వెనుక ఆంతర్యం ఏమిటనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ తరపున తాను కూడా సీఎం అభ్యర్థి రేసులో ఉన్నానని పాదయాత్రలో ఉన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రకటించుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతల్లో భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి మాత్రమే సీనియర్ నేతలుగా కొనసాగుతున్నారు. భట్టి ఈ రకంగా వ్యాఖ్యలు చేయడంతో.. ఈ అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరిగి ఉండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.