
వేర్వేరు ఘటనల్లో గుర్తు తెలియని వాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు.
పటాన్‌చెరు టౌన్: గుర్తుతెలియని వాహనం బైక్ ను ఢీకొట్టిన ఘటనలో పటాన్‌చెరు పోలీసు స్టేషన్ పరిధిలో ఒకరు మృతి చెందారు.
ఎస్‌ఐ రామానాయుడు వివరాల ప్రకారం..సూర్యాపేట జిల్లాకు చెందిన గోపిరెడ్డి(31) బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో ఉంటూ అపర్ణ కన్‌స్ట్రక్షన్‌లో స్టోర్ ఇన్‌చార్జ్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో మంగళవారం విధుల్లో భాగంగా సంగారెడ్డి వెళ్లి తిరిగి రాత్రి హైదరాబాద్ వస్తుండగా మార్గ మధ్యలో పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ ఎస్‌బీఐ యూటర్న్ వద్దకు రాగానే వెనుకాల నుంచి గుర్తుతెలియని వాహనం బైక్ ను ఢీకొట్టింది.
తీవ్రగాయాలైన గోపిరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మృతుడి సోదరుడు మధుసూదన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మెదక్ రూరల్: గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన హవేళిఘణాపూర్ మండలం ఔరంగాబాద్ తండా శివారులో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం గుండారం గ్రామానికి చెందిన బుడావత్ వినోద్ కుమార్(31) మంగళవారం రాత్రి మెదక్ నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా మార్గమధ్యలో గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న వినోద్‌ను స్థానికులు 108 వాహనంలో మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతిచెందినట్లు పేర్కొన్నారు. మృతుడి తండ్రి జమ్లా నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.